మహేశ్వరం, న్యూస్‌లైన్: మహేశ్వరం నియోజకవర్గం తనకు పుట్టినిల్లు లాంటిదని, రానున్న ఎన్నికల్లో ఇక్కడినుంచే పోటీ చేస్తానని రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మండల పరిధి మన్సాన్‌పల్లి గ్రామంలో శుక్రవారం ఆమె పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. నాలుగున్నర సంవత్సరాలలో నియోజకవర్గంలో తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని, తాను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నమ్మరాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ మహేశ్వరం నియోజకవర్గం వదిలే ప్రసక్తే లేదని సబితాఇంద్రారెడ్డి మరోమారు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మహేశ్వరం నియోజకవర్గం నుంచే పోటీ చేసి అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులకు అందించాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. మళ్లీ ఆవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో పార్టీ సీనియర్ నాయకుడు రఘుమారెడ్డి, ఎన్‌ఆర్‌జీఈఎస్ సభ్యుడు ఇజ్రాయేల్, పార్టీ మండల అధ్యక్షుడు శివమూర్తి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ డెరైక్టర్ మల్లేష్, పీసీసీ ఎస్సీ సెల్ కార్యదర్శి మంత్రి రాజేష్, పీఏసీఎస్ చైర్మన్ అంబయ్య, నాయకులు సమీర్, ఈశ్వర్, ఆంజనేయులు పాల్గొన్నారు.
మహేశ్వరం నుంచే పోటీ చేస్తా
Published Sat, Nov 9 2013 12:39 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
Advertisement