చిన్నికృష్ణ, ఏఆర్ డీఎస్పీ
అనంతపురం సెంట్రల్: పోలీసు శాఖలో ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణపై ఎట్టకేలకు బదిలీవేటు పడింది. ఈయన్ను వైఎస్సార్ కడప జిల్లా ఏఆర్ డీఎస్పీగా బదిలీ చేస్తూ అక్కడ పనిచేస్తున్న ఎన్.మురళీధర్‌ను అనంతపురం ఏఆర్ డీఎస్పీగా నియమించారు. ఏఆర్‌విభాగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, సిబ్బందిపై వేధింపులు తదితర ఘటనలపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. తాజాగా రెండు రోజుల క్రితం ఓ కానిస్టేబుల్‌ను నానా దుర్బాషలాడాడు. దీనిపైనా ‘నోరు తెరిస్తే బూతులే!’ అన్న శీర్షికన సాక్షిలో సోమవారం కథనం ప్రచురితమైంది. డీఎస్పీ మాటలతో మానసికక్షోభకు గురైన బాధిత కానిస్టేబుల్ పోలీస్‌స్టేషన్‌లో సైతం ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు.(నోరు తెరిస్తే బూతులే !)
అయితే ఉన్నతాధికారులు బుజ్జగించడంతో మిన్నకుండిపోయారు. కేవలం ఈ ఘటన మాత్రమే కాకుండా గతంలో సైతం ఏఆర్ విభాగంలో ఆయన తీరు ఆద్యంతం వివాదాస్పదమయ్యింది. ఎదురుతిరిగే వారిపై కక్షకట్టి డ్యూటీలు వేస్తుండడంతో సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. దీనిపై కొంతమంది సిబ్బంది ఎస్పీ నుంచి డీఐజీ, ఐజీ, డీజీపీ వరకు ఫిర్యాదులు చేశారు. తప్పనిపరిస్థితుల్లో అప్పటి అనంతపురం డీఎస్పీ వెంకట్రావుచే విచారణ జరిపించారు. అయితే నామమాత్రంగా విచారించి సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టారు. అంత జరిగినా ఆయనలో పెద్దగా మార్పు రాకపోగా సిబ్బందిని మరింత ఇబ్బందులపై గురిచేస్తూ వచ్చారు. ఏఆర్‌లో జరుగుతున్న పరిణామాలను ‘సాక్షి’ ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువచ్చింది. తాజాగా జరిగిన పరిణామాలపై విచారణ చేసిన రాష్ట్ర ఉన్నతాధికారులు ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణను బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment