
శ్రీకాకుళం సిటీ: ‘దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న.. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్.. ఈ గేయం రాసింది ఆధునికాంధ్ర సాహిత్య కవి, ఆధునిక కవితా పితామహుడు గురజాడ అప్పారావు. దేశ భక్తిభావాన్ని విద్యార్థుల్లో మరింత పెంచేందుకు ఈ గేయాన్ని పాఠశాల స్థాయి నుంచే గీతాలాపన చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన మనవరాలు అరుణ గురజాడ పేర్కొన్నారు. అమెరికా టెక్సాక్స్‌లో నివాసముంటున్న ఈమె ఆదివారం సిక్కోలు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
క్షేత్రస్థాయిలోకి గురజాడ సిద్ధాంతాలు..
గురజాడ సంస్థల నేతృత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాలోనూ పలుసేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్నాం. గురజాడ ఆశయాలను, సిద్ధాంతాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లాలన్నదే మా ఉద్దేశం. దేశమును ప్రేమించుమన్న గేయం ద్వారా గురజాడ ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారు. సమాజం అంటే మనం అనే పదం ఎక్కువగా ఉండాలి. దురదృష్టవశాత్తు ఇప్పుడా పదం కనిపించడం లేదు. నేను, నా కుటుంబసభ్యులు, నా సంసారం.. ఇలా అన్నింటిల్లోనూ నా.. అనే పదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తోటివారికి సాయపడాలి..
ప్రకృతి, సమాజాం ఎంతో ఇచ్చిందనే సంతృప్తితో తోటివారికి కొంత సాయపడాలి. ప్రతి ఒక్కరూ కనీసం ఒఒక రూపాయిని ఇతరులకు సాయం చేయడం ద్వారా భగవంతుడు వేరే విధంగా తిరిగి మళ్లీ అదే ధనాన్ని మనకి ఇస్తాడు.
కార్యరూపం దాల్చని కన్యాశుల్కం–2
కన్యాశుల్కంలో గిరీశాన్ని, ఇతర పాత్రలను ఎలా మార్పుచేశారో అందరికి తెలిసిందే. కన్యాశుల్కం–2లో చాలా విషయాలను గురజాడ ప్రస్తావించి సమాజాన్ని చైతన్యపరుద్దామని భావించారు. దురదృష్టవశాత్తు ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. దేశాన్ని ప్రేమించుమన్న అనే గేయాన్ని మనదేశంతో పాటు ప్రపంచదేశాలను ఉద్దేశించి ముందుచూపుతోనే రచించారు. విజయనగరంలో సొంతింట్లో ప్రతిరోజు పిల్లలకు, పెద్దలకు వేర్వరుగా ఒక సభను ఏర్పాటుచేద్దామని భావించేవారు. స్థానికంగా కొన్ని పరిస్థితుల వల్ల ఆ కార్యక్రమాలు ముందుకు సాగలేదు.
20న గురజాడ కళావేదిక ప్రారంభం..
రాజమండ్రిలోని బిక్కవోలు సింగంపల్లిలో ఈ నెల 20న గురజాడ కళావేదికను ప్రారంభించనున్నాం. గత ఏడాది పిల్లల్లో సృజనాత్మక పెంపొందించేందుకు స్టడీసెంటర్, గ్రంథాలయాలను స్థాపించాం. ఐటీ వృత్తిలో సంపాదిస్తున్న మొత్తంలో కొంతభాగాన్ని గురజాడ సంస్థలకు ఖర్చుపెడుతూ ఆయన ఆశయసాధనకు కృషి చేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment