సాక్షి, అమరావతి: మొదట నుంచి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ సమయంలోనూ వారికి అండగా నిలిచింది. ఈ విపత్కర పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా స్వయంగా వారి వద్దకే వెళ్లి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ఇందుకోసం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను సైతం ప్రారంభించింది. పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన తక్కువ రోజుల్లోనే వారి ఖాతాల్లో నగదు సైతం జమ చేసింది. దీంతో రైతులు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ తమ పంట ఉత్పత్తులను మంచి గిట్టుబాటు ధరలకు అమ్ముకోగలిగారు. ప్రభుత్వం లాక్‌డౌన్ సమయంలో గత నెల రోజుల్లో ఏకంగా 5 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా పండ్లు, కూరగాయలు కొనుగోలు
చేసి అమ్మకాలు చేయించింది.
► చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో రైతుల నుంచి నేరుగా టమాటాను కొనుగోలు చేసి రాష్ట్రంలోని రైతుబజార్లలో విక్రయించింది. దీంతో రైతుల్ని ఆదుకోవడమే కాకుండా రైతు బజార్ల ద్వారా కొనుగోలుదారులకు తక్కువ రేటుకే అందించింది.
► లాక్‌డౌన్‌తో రైతులు నష్టపోకుండా ఆంక్షలు సడలించి ఉద్యాన ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా రవాణా పర్మిట్లు మంజూరు చేసింది.
► మార్కెటింగ్, ఉద్యాన శాఖలు సమష్టి ప్రణాళిక ద్వారా రైతుల నుంచి పండ్లను నేరుగా కొనుగోలు చేసి.. రాష్ట్రంలోని రైతు బజార్లు, మొబైల్ రైతు బజార్ల ద్వారా విక్రయించే ఏర్పాట్లు చేశాయి.
► ప్రభుత్వం రాయలసీమలో అరటి రైతులను ఆదుకునేందుకు టన్ను రూ.3,500 చొప్పున కొనుగోలు చేసి రైతు బజార్లు, మొబైల్ రైతు బజార్లు, స్వయం సహాయక గ్రూపుల ద్వారా గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లి అమ్మకాలు చేపట్టింది. ఇదే తరహాలో బత్తాయి, కూరగాయలు, టమాటా, ఉల్లి రైతులనూ ఆదుకుంది.
రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి
► రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా లాక్‌డౌన్ సమయంలో నెల రోజుల వ్యవధిలోనే 3,30,494 మెట్రిక్ టన్నుల పండ్లను, 1,70,949 మెట్రిక్ టన్నుల కూరగాయలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.
► వీటిని గ్రామస్థాయిలో అమ్మేందుకు స్వయం సహాయక గ్రూపులను వినియోగించింది. ఈ అమ్మకాల ద్వారా గ్రూపులకు మంచి ఆదాయం లభించేలా చేయడమే కాకుండా గ్రామ స్థాయిలో పెద్ద మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
► కరోనా విపత్తు తర్వాత గ్రామ స్థాయిలో రైతుల పంటల క్రయవిక్రయాలను విస్తృతం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది.
► ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోజూ వ్యవసాయం, మార్కెటింగ్, ఉద్యాన శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు రైతులను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
భవిష్యత్తుకు కొత్త బాటలు
సీఎం జగన్ రైతులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యల ద్వారా భవిష్యత్తుకు కొత్త బాటలు పడుతున్నాయి. పంటల క్రయ విక్రయాలు గ్రామ స్థాయి వరకు వెళ్లిపోయాయి. ఇక ప్రాసెసింగ్ ప్లాంట్లు, గిడ్డంగుల ఏర్పాటుతో రైతులకు భరోసా లభిస్తుంది. మంచి ధర రాని సమయం లో గిడ్డంగుల్లో పంటను నిల్వ చేసుకుంటారు. ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఉప ఉత్పత్తులు తయారుచేసి పంటలకు అధిక ధరలను రైతులు పొందుతారు. వీటి ఏర్పాటుకు ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి.
– ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, రాష్ట్ర వ్యవసాయ మిషన్
Comments
Please login to add a commentAdd a comment