శ్రీవారి భక్తులకు సమైక్య సెగ
సాక్షి, తిరుమల/తిరుపతి : సీమాంధ్ర బంద్ ప్రభావంతో మంగళవారం తిరుమల శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొండపైకి వెళ్లేవాళ్లు, తిరుమల నుంచి తిరిగి వచ్చేవారు రవాణా సదుపాయాలు లేక అష్టకష్టాలు పడ్డారు. ఉదయం నుంచే తిరుమల, తిరుపతి మధ్య తిరిగే 107 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. టీటీడీ, ప్రైవేట్ వాహనాలతోపాటు ద్విచక్రవాహనాలనూ సమైక్యవాదులు అనుమతించలేదు. దీంతో వేలాదిమంది భక్తులు తిరుపతిలోనే ఉండిపోయారు. రోడ్లపైనే పడిగాపులు కాశారు. కొంతమంది కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.
తిరుపతిలో ఉండే ఉద్యోగులను, ఆలయ సిబ్బందిని తెల్లవారుజామునే అలిపిరి టోల్‌గేట్ తర్వాత ఘాట్‌రోడ్డు మీదుగా టీటీడీ లారీలు, ఇతర వాహనాల ద్వారా తిరుమలకు చేర్చారు. ఆ సమయానికి రాని కొంతమంది రవాణా సౌకర్యంలేక వెనుదిరిగారు. సాయంత్రం 4 గంటల తర్వాత కొన్ని బస్సులు, రాత్రి 7 గంటల తర్వాత మొత్తం బస్సుల రాకపోకలు కొనసాగాయి. భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో లఘుదర్శనం కల్పించారు. సాయంత్రం వరకు శ్రీవారి ఆలయ ప్రాం గణం కొంత బోసిపోయినట్టు కనిపించింది. తిరుమలకు రాలేని భక్తులకు అలిపిరి, శ్రీనివాసం, విష్ణునివాసం, రైల్వే స్టేషన్ల వద్ద టీటీడీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు అందజేశారు. టీటీడీ కాంప్లెక్స్‌లలో ఆశ్రయం కల్పించినట్లు ఈవో ఎంజీ గోపాల్ విలేకరులకు తెలిపారు.
బస్టాండ్‌లో తోపులాట
సాయంత్రం 4 గంటల నుంచి బస్సులు, ప్రయివేట్ వాహనాల కోసం భక్తులు ఎగబడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద భక్తుల మధ్య తీవ్రమైన తోపులాటలు జరిగాయి. కొందరిని బస్టాండు కంపార్ట్‌మెంట్లో పెట్టి గేట్లు మూసేశారు. బయట ఉన్న భక్తులను రోడ్లపైనే కూర్చోబెట్టి టికెట్ల మంజూరు చేశారు. చంటి బిడ్డలు, మహిళలు, వృద్ధులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.