సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో బుధ, గురువారాలు రహదారులను దిగ్బంధం చేస్తున్నారు. 48 గంటల పాటు జరిగే ఈ కార్యక్రమంలో
సాక్షి ప్రతినిధి, గుంటూరు : సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో బుధ, గురువారాలు రహదారులను దిగ్బంధం చేస్తున్నారు. 48 గంటల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తం అయ్యాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆ పార్టీ జిల్లా, సిటీ కన్వీనర్లు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ సీనియర్లు దీనిని విజయవంతం చేయాలని, ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసే విధంగా ఈ కార్యక్రమం జరగాలన్నారు. ఆర్‌టీసీ, లారీ కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు. రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో చెన్నై- కోల్‌కతా రహదారిలో చిలకలూరిపేట మండలం బొప్పుడి వద్ద, యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద, రాష్ట్రీయ రహదారుల్లో చిలకలూరిపేట మండలం పసుమర్రు, కోమటినేనివారిపాలెం గ్రామాల వద్ద రహదారుల దిగ్బంధం జరగనున్నది. గుంటూరు సిటీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుంచి అంకిరెడ్డిపాలెం వై.జంక్షన్ వద్ద కార్యక్రమం జరగనున్నది. దాచేపల్లిలోని అద్దంకి-నార్కెట్‌పల్లి హైవే దిగ్బంధంలో గురజాల సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి పాల్గొంటారు. మంగళగిరి సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చెన్నై హైవేపై మంగళగిరి పట్టణంలోని తెనాలి జంక్షన్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్- గుంటూరు రహదారి, మాచర్ల - శ్రీశైలం రహదారిని పూర్తిగా స్తంభింపచేయనున్నారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ ఆధ్వర్యంలో పెదకాకానిలో జాతీయ రహదారిని దిగ్బంధం చేసేందు కు నిర్ణయం తీసుకున్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రహదారులను దిగ్బంధం చేసేందుకు పార్టీ శ్రేణులు చర్యలు తీసుకున్నాయి. మిగిలిన నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ విభాగాలు ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సమాయత్తం అవుతున్నాయి.