సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో)గా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావును ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి పేషీలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఎ.గిరిధర్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. వీరితో పాటు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు టీటీడీ ఈవోగా ఉన్న ఎంజీ గోపాల్‌ను బదిలీ చేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న అజయ్ జైన్‌ను ఇంధన, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. కళాశాల విద్యా కమిషనర్ కె.సునీతకు సాంకేతిక విద్య ఇన్‌చార్జి కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
అజయ్ జైన్‌కు ఏపీ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఇన్‌క్యాప్) వైస్ చైర్మన్ కం మేనేజింగ్ డెరైక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కూడా ప్రభుత్వం అప్పగించింది. ఈ స్థానంలో పనిచేస్తున్న ఎన్.గుల్జార్‌ను బదిలీ చేసినా పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫారసుల ప్రకారం.. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఐఏఎస్‌ల విభజన ప్రాథమిక జాబితాలో గోపాల్ పేరును తెలంగాణ కోటాలో చేర్చింది. వారంలో ఐఏఎస్‌ల విభజన పూర్తయ్యే అవకాశం ఉన్నందునే పోస్టింగ్ ఇవ్వలేదని తెలిసింది.