ఇసుక పట్లు | sand mafia | Sakshi
Sakshi News home page

ఇసుక పట్లు

Published Wed, Feb 24 2016 11:20 PM | Last Updated on Mon, Aug 27 2018 8:44 PM

ఇసుక పట్లు - Sakshi

ఇసుక పట్లు

‘తాండవ’పై కన్నేసిన మంత్రులు
టెండర్లకు సిద్ధమైన అయ్యన్న,యనమల అనుచరులు
ఎలాగైనా చేజిక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు

 
ఇసుక కోసం మంత్రుల అనుచరులు సిగపట్లు పడుతున్నారు.   తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దులో ఉన్న తాండవ రిజర్వాయర్‌లో పూడిక తీత ద్వారా వెలికితీయాలని నిర్ణయించిన ఇసుకను చేజిక్కించుకునేందుకు ఈ జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు ఎత్తుకు పైఎత్తులేస్తున్నారు. అధికారికంగా వెల్లడించిన ఇసుక నిల్వలకంటే అధికంగా కొల్లగొట్టవచ్చనే యోచనలో  అనుచరులు ఉన్నారు.
 
విశాఖపట్నం: విశాఖ-తూర్పుగోదావరి జిల్లాలను వేరుచేసే తాండవ నదిలో ఇసుక పై ఇప్పటి వరకు తుని టీడీపీ నేతలే పెత్తనం చలాయించారు. నదీ తీరం ఇరువైపులా ఉన్నప్పటికీ ఎక్కువగా మాత్రం తునికి చెందిన పచ్చనేతలే తవ్వుకుపోయేవారు. నిన్నటి వరకు డ్వాక్రా సంఘాల మాటున నదీ గర్భంలో ఇసుకను లూటీ చేసిన   ఇసుకాసురులు ఇప్పుడు అధికారిక దోపిడి కోసం ఉవ్విళ్లూరుతున్నారు.   పూర్తిగా విశాఖ జిల్లా పరిధిలో ఉండే తాండవ రిజర్వాయర్‌లో పేరుకుపోయిన ఇసుక వెలికి తీసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడంతో దానిపై కూడా ఇరు జిల్లా నేతలే కన్నేశారు.  తమ జిల్లా పరిధిలో ఉండే రిజర్వాయర్‌లో ఇసుక తమకే చెందాలన్న పట్టుదలతో ఈసారి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడి అనుచరులు పావులు కదుపుతున్నారు.  గురువారం నుంచి ప్రారంభం కానున్న  టెండర్ల ప్రక్రియలో పాల్గొనేందుకు అయ్యన్న కీలక అనుచరుడు రంగం సిద్ధం చేసుకున్నారు. మరో పక్క ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు తన అనుచరులతో ఈ ఇసుక కోసం టెండర్ వేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.
 
రిజర్వాయర్‌కు తూట్లు...
 రిజర్వాయర్‌లో 62,470 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్టుగా అధికారులు లెక్క తేల్చారు. ఈ ఇసుకను వెలికితీసేందుకు వేలం పాటలు నిర్వహించేందుకు అధికారులు నేడు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ నెల 28  వరకు టెండర్లు స్వీకరించి 29న తెరవనున్నారు. రిజర్వాయర్‌లో అధికారులు చెబుతున్న ఇసుకే కాకుండా పూడికతీత మాటున రిజర్వాయర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో లక్షన్నర క్యూబిక్ మీటర్ల ఇసుకను వెలికితీసే అవకాశాలున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక జరిగితే రిజర్వాయర్ ఉనికికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇదేరీతిలో ఇప్పటి వరకు తవ్వకాల పేరుతో  తాండవ నదీతీరానికి నష్టం కలిగించారు.   ఇప్పుడు రిజర్వాయర్‌కూ తూట్లు పొడిచేందుకు ఇసుకాసురులు సిద్ధమవుతున్నారు. ఏదేమైనా నేటి నుంచి ప్రారంభం కానున్న టెండర్ల స్వీకరణలో విశాఖలోని వేలం వేస్తున్న ఏకైక రీచ్ కోసం మంత్రుల మధ్య సిగపట్లు తప్పేటట్టు కనిపించడం లేదు. నిన్నటికి నిన్న లేటరైట్ మైనింగ్ కోసం ఇరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ నడిచినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పుడు తాండవ ఇసుక వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరుకు మరింత ఆజ్యం పోసే సూచనలు లేక పోలేదని ఆ పార్టీ వారే అంటున్నారు.
 
మంత్రుల అండదండలతోనే..
తాండవనదిలో ‘తూర్పు’  వైపు ఉన్న నోటి ఫైడ్ రీచ్‌లను దక్కించుకునేందుకు కృష్ణుడు అండ్ కో సర్వం సిద్ధం చేసుకుంది.  ఈ రీచ్‌ల వేలం అనూహ్యంగా వాయిదాపడడంతో ఇప్పుడు వీరి కన్ను  తాండవ రిజర్వాయర్‌లోని ఇసుకపై పడింది. ఎలాగైనా ఈ ఇసుకను చేజిక్కించు కోవాలని చాపకిందనీరులా ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో యనమల, అయ్యన్న అనుచరుల మధ్య నెలకొన్న పోటీ అధికారులకు తలనొప్పిగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. ఒక వైపు కృష్ణుడు తన అనుచరులతో రంగంలోకి దిగుతుంటే.. మరోపక్క అయ్యన్న ప్రధాన అనుచరుడు, నర్సీపట్నంలో పార్టీ బాధ్యతలు చూస్తున్న కీలకనేత  పూడికతీత రీచ్‌ను చేజిక్కించుకోవాలని పావులు క దుపుతున్నారు. ఎవరికి వారు మంత్రుల ద్వారా అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement