చెన్నూర్, న్యూస్‌లైన్ : ఇసుక మాఫియూపై ఆర్డీవో కొరడా ఝళిపించారు. అర్ధరాత్రి ఇసుక స్థావరాలపై దాడుల చేసి హల్‌చల్ సృష్టించారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారం మేరకు మంచిర్యాల ఆర్డీవో చక్రధర్ బుధవారం అర్ధరాత్రి మంచిర్యాల తహశీల్దార్ కిషన్, ఆర్‌ఐ లక్ష్మీనారాయణ, శ్రీహరి, చందు, ప్రభాకర్ బృందంతో కలిసి ఇసుక స్థావరాలపై వరుస దాడులు నిర్వహించారు. స్థానిక బతుకమ్మ వాగు, మండలంలోని చింతలపల్లి సమీపంలోని గోదావరి నది ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థకు, ఫిషర్ మెన్ సొసైటీ, ప్రైవేట్ పట్టాదారుడికి చెందిన 63 లారీలు ఇసుక నింపుకుని తరలిస్తుండగా ఆర్డీవో పట్టుకున్నారు. డంప్ యూర్డుల వద్ద ఇసుక నింపుకునేందుకు సిద్ధంగా ఉన్న 132 లారీలను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 195 లారీలతోపాటు డంప్‌యార్డ్ వద్ద ఉన్న రెండు జేసీబీలను పట్టుకున్నారు. అనంతరం చెన్నూర్ డిప్యూటీ తహశీల్దార్, జైపూర్ తహశీల్దార్ రవీందర్‌ను సంఘటన స్థలానికి పిలిపించారు. పట్టుకున్న లారీల వివరాలను అందజేశారు. శుక్రవారం విచారణ జరిపి అనుమతి లేని లారీలను సీజ్ చేసి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి గురువారం వేకువజాము 3 గంటల వరకు ఈ దాడులు కొనసాగాయి.
అధికారుల తీరుపై అనుమానాలు...
బుధవారం అర్ధరాత్రి ఇసుక తీసుకెళ్తున్న సుమారు 63 లారీలను పట్టుకున్నట్లు ఆర్డీవో చక్రధర్ తెలిపారు. కానీ.. ఇందుకు చెన్నూర్ తహశీల్దార్ వీరన్న గురువారం తెలిపిన వివరాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఇసుక తరలిస్తుండగా 12 లారీలు పట్టుకున్నామని, ఇందులో 8 సింగరేణి సంస్థకు చెందినవని, మిగిలిన నాలుగు 4 ప్రైవేట్ వ్యక్తులవని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ లారీలకు అనుమతి ఉందని, మిగతా లారీలకు లేకపోవడంతో ఒక్కోదానికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.40 వేలు జరిమానా విధించామని చెప్పారు. ఇసుక లోడింగ్ లేని 132 లారీల విషయూన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. తహశీల్దార్ తెలిపిన పొంతనలేని వివరాలతో అధికారుల తీరుపై స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బడా నాయకులు ఒత్తిడి ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మైనింగ్‌శాఖ అనుమతి లేకుండానే..
పట్టణంలోని గోదావరి నది నుంచి ఇసుక తరలించేందుకు సింగరేణి సంస్థకు 30 సంవత్సరాలపాటు అనుమతి ఉంది. ఫిషర్‌మెన్ సొసైటీ ఆధ్వర్యంలో గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న భూముల్లో లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుక తీసుకెళ్లేందుకు నవంబర్ 20 వరకు అనుమతి పొందారు. బతుకమ్మ వాగు పరీవాహక ప్రాంతంలోని తన పట్టాభూ మిలో ఇసుక మేటలు వేసిందని, తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పట్టాదారు దేవేందర్‌రెడ్డి తహశీల్దార్ వీరన్నకు దరఖాస్తు చేసుకోగా ఆయన అనుమతి ఇచ్చారు. ఈ అనుమతి 2014 ఫిబ్రవరి వరకు 2.94 క్యూబిక్ మీటర్ల ఇసుక తరలించేందుకు ఉంది. వీరు ఇలా ఇసుకను పట్టణంలోని ఒకచోట డంప్ చేసుకునేందుకు అనుమతి పొందారు. ఇందుకు సంబంధించి వేబిల్లులూ తీసుకున్నారు. ఇక్కడి నుంచి పట్టణ ప్రాంతాలకు ఇసుక తరలించేందుకు భూగర్భ గనుల శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంది. కానీ.. ఏపీ మైనింగ్ నుంచి అనుమతి పొందకుండా డంప్ యార్డ్ వరకు ఉన్న అనుమతి పత్రాలతో పట్టణ ప్రాంతాలకు ఇసుక తరలించి అందినంతా దండుకుంటున్నారు.
ఇసుక మాఫియూపై కొరడా
Published Fri, Nov 1 2013 1:32 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement