అంతర్వేది బీచ్‌ వద్ద విషాదం.. నవ వధువరులిద్దరూ.. | - | Sakshi
Sakshi News home page

అంతర్వేది బీచ్‌ వద్ద విషాదం.. నవ వధువరులిద్దరూ..

Published Tue, Dec 12 2023 1:04 AM | Last Updated on Tue, Dec 12 2023 10:50 AM

- - Sakshi

అంతర్వేది బీచ్‌లో ఎదురు చూస్తున్న బంధువులు, గల్లంతైన గాయత్రీ, లక్ష్మీనారాయణ (ఫైల్‌)

ఏలూరు: అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి ముచ్చటగా రెండు మాసాలు గడవలేదు. పెళ్లి పందిరి తోరణాలు కూడా వాడలేదు. అంతలోనే నవవధూవరులు సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. స్వామివారిని దర్శించుకుని తిరిగి ఇంటికి వస్తారని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు నూతన జంట గల్లంతయ్యారనే సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది బీచ్‌లో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనతో వధూవరుల ఇళ్లు శోకసంద్రంలో మునిగిపోయాయి.

ఏలూరు జిల్లా కలిదిండి మండలం గుర్వాయిపాలెం గ్రామానికి చెందిన అంబటి పరుశురామయ్య, ఉదయలక్ష్మీ మొదటి కుమార్తె గాయత్రీ (21)ని పశ్చిమగోదావరి జిల్లా జువ్వాలపాలెంకు చెందిన రేలంగి బసవలింగం, జయలక్ష్మీ కుమారుడు లక్ష్మీనారాయణ (26)తో నవంబర్‌ 1న కై కలూరు నియోజకవర్గం సింగరాయపాలెం గుడిలో ఘనంగా వివాహం జరిపించారు. లక్ష్మీనారాయణ బీటెక్‌, బీఈడీ చేసి భీమవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు.

కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో కొత్త దంపతులు లక్ష్మీనారాయణ, గాయత్రీ ద్విచక్రవాహనంపై మధ్యాహ్నం 3 గంటలకు అంతర్వేది దేవాలయాన్ని దర్శించుకుని నాలుగు గంటలకు బీచ్‌కు వెళ్లారు. బంధువులతో కలిసి కాకుండా వాహనంపై బీచ్‌లో దూరంగా వెళ్లారు. అక్కడ వాహనం, సెల్‌ఫోన్లు ఉంచి స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. తరువాత కొద్ది సమయానికే వీరు కనిపించలేదు. సెల్‌ఫోను ఆధారంగా బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. సఖినేటిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో వరుడి తండ్రి బసవలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు, మైరెన్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం వరకు వారి జాడ లేదు.
ఇవి కూడా చ‌ద‌వండి: 11మందిని పొట్టన పెట్టుకుని?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement