
ఇస్రోలో ఉద్యోగం.. 100 ఎకరాలు ఉందంటూ మోసం
ఇంతవరకూ రూ.1.50 కోట్ల వరకూ మోసగించాడంటున్న పోలీసులు
ఏలూరు టౌన్: మ్యాట్రిమోనీ ద్వారా వల వేసి అనేక మందిని మోసం చేస్తూ భారీగా డబ్బులు కాజేసిన నిత్య పెళ్లికొడుకుని భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వివరాలు వెల్లడించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం బంగారుపేటకు చెందిన ఆశం అనిల్‌బాబు అలియాస్ కళ్యాణ్‌రెడ్డి 9వ తరగతి వరకే చదివినా.. ఇస్రోలో హెచ్‌ఆర్ అని చెప్పుకునేవాడు.
భారత్ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో కల్యాణ్ పేరుతో రిజిస్టర్ చేసుకోగా, పెళ్ళి సంబంధాలు రాకపోవడంతో కళ్యాణ్ రెడ్డిగా మార్చాడు. పెళ్ళి సంబంధాల కోసం ఫోన్ చేసేవారిని తన తండ్రి మాట్లాడుతున్నట్టుగా నమ్మిస్తాడు. తన కొడుకు ఇస్రోలో పనిచేస్తున్నాడని, తాను, తన భార్య ఇస్రోలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నామని, తమకు 100 ఎకరాల భూమి, రెండు విల్లాలు ఉన్నాయని నమ్మిస్తుంటాడు. కట్నకానుకలతో పనిలేదని చెబుతూ పెళ్ళి చూపులకు వెళతాడు. పెళ్ళి కూతురు నచ్చిందంటూనే వారి బంధువుల వివరాలు సేకరిస్తాడు.
వారికి ఇస్రోలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి భారీ మొత్తంలో నగదు కాజేస్తాడు. జనాలను నమ్మించేందుకు హైదరాబాద్‌లో ఒక ఫాం హౌస్, బెంగళూరులో ఒక విల్లాను అద్దెకు తీసుకుని వాటిని తనవే అని కలరింగ్ ఇస్తాడు. హైదరాబాద్‌లో ఒక పీఏ, వాచ్‌మేన్, ఒక మహిళా అసిస్టెంట్, ఇద్దరు బౌన్సర్లను పెట్టుకుని.. సలహాలు ఇచ్చేందుకు కాశీ అనే వ్యక్తిని, పెళ్ళి చేసేందుకు పంతులును సైతం ఏర్పాటు చేసుకున్నాడు.
పెళ్లి, ఉద్యోగంటూ రూ.9.53 లక్షల మేర మోసం
ఏలూరు జిల్లా గుండుగొలను గ్రామానికి చెందిన మహిళను నమ్మించి ఆమె రెండో కుమార్తెను పెళ్లి చేసుకుంటానని, మూడో కుమార్తెకు ఇస్రోలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి ఆన్‌లైన్‌లో రూ.9.53 లక్షలు కాజేశాడు. శశాంక్ అనే వ్యక్తి ద్వారా ఇంటర్వ్యూ చేయించి, ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చాడు. డబ్బులు తీసుకుని ఎంతకీ జాబ్‌లో చేర్పించకపోవటంతో మోసపోయామని తెలుసుకుని వారు భీమడోలు పోలీసులకు 2023లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిత్య పెళ్లికొడుకు అనిల్‌బాబును అరెస్ట్ చేశారు. అనిల్‌బాబు ఇంతవరకూ పలువురిని రూ.1.50 కోట్ల వరకూ మోసగించినట్లు తేలింది.
ఈ కేసులో అనిల్‌బాబుతో పాటు కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కాలమలకు చెందిన తుంగ శశాంక, నంద్యాల జిల్లా బనగానిపల్లి మండలం బత్తులూరుపాడుకి చెందిన పల్లె హేమంత్‌రెడ్డిని భీమడోలు సీఐ యూజే విల్సన్ అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.2 లక్షల నగదు, కారు, 5 సెల్‌ఫోన్లు, 13 సిమ్ కార్డులు, ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్లు తయారు చేసే కంప్యూటర్, రెండు ల్యాప్‌టాప్‌లు, బ్యాంక్ చెక్‌బుక్‌లు 4, ఇతర ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ విల్సన్, ఎస్‌ఐ వై.సుధాకర్ ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment