పొట్టి శ్రీరాములుకు ఘోర అవమానం
నివాళులను మరచిన మంత్రులు
వెళ్లిపోతున్న సమయంలో హడావుడిగా దండలు
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘోర అవమానం జరిగింది. స్థానికంగా నిర్వహించిన సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సొంత ప్రచారంలో పడి అమరజీవి 72వ వర్ధంతి కార్యక్రమాన్ని మరచిపోయారు. సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమం ఏర్పాటుచేసిన గాంధీబొమ్మల సెంటర్‌లోనే పలువురు దేశ నాయకులు విగ్రహాలు ఉన్నాయి.
స్టేజీ కూడా ఈ విగ్రహాల పక్కనే ఏర్పాటు చేశారు. కార్యక్రమం అనంతరం 2కే రన్ ప్రారంభించిన మంత్రులు తిరిగి వెళిపోతున్న సమయంలో ఎవరో గుర్తుచేయగా.. హడావుడిగా అమరజీవికి నివాళులర్పించారు. బాధాకరమైన విషయమేంటంటే.. ‘దండలు తీసుకురండి..’ అని చెప్పగా అక్కడున్న వ్యక్తులు స్టేజీపై పడి ఉన్న దండలను ఏరుకుని మంత్రులకు ఇవ్వడం.. వాటినే మంత్రులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి వేయడం. అలాగే గాంధీబొమ్మల సెంటర్‌లో 13 విగ్రహాలు ఉండగా గాంధీజీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు మాత్రమే దండలు వేసి అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, బాబూ జగ్జీవన్‌రామ్, ప్రకాశం పంతులు వంటి మిగిలిన మహానేతల విగ్రహాలకు దండలు వేయకుండా వెళ్లిపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహిళల కోసమా.. మంత్రి ప్రచారం కోసమా..
సేవ్ ద గర్ల్ చైల్డ్ 2కే రన్ కార్యక్రమంలో భాగంగా స్టేజీపై ఏర్పాటుచేసిన బ్యానర్‌లో ఎక్కడా ఒక్క అమ్మాయి ఫొటో గాని, మహిళ ఫొటో గాని లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. బ్యానర్‌పై మంత్రి నిమ్మల ఫొటో మాత్రమే వేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో ఈ కార్యక్రమాన్ని మహిళల కోసం ఏర్పాటు చేశారా లేక మంత్రి ప్ర చారం కోసం ఏర్పాటు చేశారా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment