పట్టుకున్నారు..వదిలేశారు
- చెన్నంపల్లి రీచ్ నుంచి లారీల్లో ఇసుక తరలింపు
- దాడుల చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
- రసీదులు సక్రమంగా ఉన్నాయని వదిలేసిన వైనం
- అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల వల్లే వదిలేశారని ఆరోపణలు
కంబదూరు: మండలంలోని చెన్నంపల్లి గ్రామ ఇసుక్ రీచ్ నుంచి ఇసుక తరలింపు విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. రీచ్ నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించాలనే నిబంధన ఉండగా కొందరు వ్యక్తులు లారీల ద్వారా ఇసుక తరలించారు. గురువారం రాత్రి ఇసుక రీచ్‌లో పది చక్రాల లారీ( కేఏ.41ఏ.8532, కేఏ-10.2259)ల్లో ఇసుక నింపారు. సమాచారం అందుకున్న కంబదూరు పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఏమైందో..ఏమోగాని వాటిని వదిలేశారు. అయితే అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఒత్తిడి తేవడంతోనే ఆ లారీలను వదిలేసినట్లు విమర్శలున్నాయి. దీనికితోడు రాత్రి సమయంలో ఇసుక తరలించరాదనే నిబంధనలున్నాయి.
అయినా కర్ణాటకకు చెందిన పది చక్రాల లారీల్లో రాత్రి వేళ ఇసుక నింపడం అనుమానాలకు తావిస్తోంది. మీసేవలో ఇసుక తరలింపునకు ట్రాక్టర్ల ద్వారా చేపడుతామని అనుమతులుండగా పది చక్రాల లారీలలో తరలిస్తుండడం అనుమానాలను రేకిత్తిస్తోంది. ఈ ఇసుక తరలింపు వెనుక అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ఎంపీపీ, ఓ సర్పంచ్ హస్తముందనే ఆరోపణలున్నాయి.
మీ సేవాలో రసీదులను పరిశీలిస్తే... రామగిరి మండలం పేరూరు మీసేవలో రామాంజినేయులు అనేవ్యక్తి మడకశిర ప్రాంతంలోని గోవింద్‌పురం గ్రామానికి ఇసుకను రవాణా చేసుకోనేందుకు 18 క్విబిక్ మీటర్లు ఇసుకకు, అశోక్ అనే వ్యక్తి అదే ప్రాంతానికి ఇసుక వరలించేందుకు 15 క్విబిక్ మీటర్లు ఇసుకను తీసుకెళ్లడానికి మీసేవలో ఎస్‌ఓపీ రశీదును పోందారు. ఎస్‌ఓపీ రశీదు ఆధారంగా కాకుండా కర్ణాటక లారీలో ఇసుకను తరలించేందుకు స్వయం సహాయక సభ్యులు ఈ-ట్రాన్సిట్ ఫారలను అందజేసినట్లు ఆధారాలు చూపుతున్నారు. పోలీసులు వాటిని పరిశీలించి సక్రమంగా ఉన్నట్లు గుర్తించి లారీలను వదిలేశారు. అక్రమంగా ఇసుక తరలించేందుకు అధికార పార్టీ నాయకులు ఇలాంటి ఎత్తుగడ వేసినట్లు ఆధారాలు కనిపిస్తున్న పోలీసులు మాత్రం వాటిని గాలికొదిలేశారు.