యాలాల, న్యూస్‌లైన్: ఇసుక అక్రమ రవాణాను అధికారులు నిరోధించడం లేదు. స్థానికులు స్పందించినా పట్టించుకోవడం లేదు. అక్రమార్కులకు అధికారులు సహకరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థానికులు కష్టపడి రెండు ఇసుక లారీలను పట్టిస్తే పోలీసులు ఓ వాహనాన్ని వదిలేశారు. ఈ సంఘటన మండల పరిధిలోని ముద్దాయిపేటలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. జిల్లా సరిహద్దులోని ముద్దాయిపేట గ్రామం మీదుగా నిత్యం అక్రమార్కులు ఇసుక రవాణా చేస్తున్నారు. ముద్దాయిపేట జిల్లా సరిహద్దులో ఉండటంతో అధికారులు ‘సరిహద్దు’ అంశాన్ని సాకుగా చూపుతూ పట్టించుకోవడం లేదు. దీంతో శనివారం రాత్రి గ్రామ సర్పంచ్ బిచ్చయ్య గౌడ్, వార్డుసభ్యులు, గ్రామ యువకులు కలిసి గ్రామం మీదుగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీ (ఏపీ 28 ఎక్స్ 9218, ఏపీ 12 వీ 9117)లను అర్ధరాత్రి సమయంలో పట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో రెండు గంటల తర్వాత ఎస్‌ఐ రాజేందర్ రెడ్డి ఇద్దరు కానిస్టేబుళ్లతో వచ్చారు. లారీలను ఠాణాకు తరలిస్తున్నట్లు చెప్పారు.
తరలించుకుపోయారట..!
రెండు లారీల్లో ఓ వాహనాన్ని పోలీసులు బాగాయిపల్లి చౌరస్తాలో వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా అక్రమార్కులు బలవంతంగా తరలించుకుపోయారని పోలీసులు ‘కథ’ చెబుతున్నారు. పోలీసులే కావాలని వదిలేసి నాటకమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముద్దాయిపేట గ్రామస్తులు కోరుతున్నారు.
భయాందోళనకు గురి చేస్తున్న ఇసుక వ్యాపారి..
వికారాబాద్ డివిజన్ మన్నెగూడ ప్రాంతానికి చెందిన ఓ ఇసుక వ్యాపారి నిత్యం తన దందాను కొనసాగిస్తున్నాడు. ఆయన తన అనుచరులతో రాత్రివేళల్లో స్థానికులను తీవ్ర భ యాందోళనకు గురిచేస్తున్నాడు. ముద్దాయిపేట- బాగాయిపల్లి మార్గంలో గ్రామస్తులను బెదిరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.
పోలీసులా.. మజాకా..!
Published Mon, Jan 13 2014 12:29 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement