ఏం తమాషాగా ఉందా..
- శానిటరీ మేస్త్రిపై కమిషనర్ మండిపాటు, సస్పెన్షన్
- పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి
- అధికారులకూ చీవాట్లు
విజయవాడ సెంట్రల్ : ‘ఏం తమాషాగా ఉందా. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరు. పారిశుధ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు. కఠిన చర్యలు ఉంటే కానీ మీరు దారికి రారు..’ అంటూ కమిషనర్ జి.వీరపాండియన్ శానిటరీ మేస్త్రిపై మండిపడ్డారు. నగర పర్యటనలో భాగంగా సోమవారం ఆయన 19వ డివిజన్‌లో పర్యటించారు. అక్కడ విధుల్లో ఉండాల్సిన వర్కర్లు కొందరు కబుర్లతో కాలక్షేపం చేస్తుండగా, మరికొందరు కనిపించలేదు. దీనిపై మేస్త్రి వి.శ్రీనివాసరావును కమిషనర్ నిలదీశారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తంచేసిన కమిషనర్ అతన్ని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిచ్చారు.
మారకపోతే.. మీరే మారిపోతారు
నగరంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని కమిషనర్ అక్కడున్న ప్రజారోగ్యశాఖ అధికారులతో అన్నారు. డంపర్ బిన్ల వద్ద చెత్త పేరుకుపోతోందని, రాజధాని నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని చెబుతున్నా పనితీరు మారడం లేదని చీవాట్లు పెట్టారు. ఈనెల 20వ తేదీన రామలింగేశ్వరనగర్‌లో విధి నిర్వహణలో అలసత్వం వహించిన 11వ డివిజన్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎన్‌వీ రమణను సస్పెండ్ చేస్తూ సోమవారం ఆదేశాలిచ్చారు. చీఫ్ ఇంజినీర్ ఎంఏ షుకూర్, ఎస్‌ఈ ఆదిశేషు, ఈఈలు ధనుంజయ, సీవీకేభాస్కర్, ఎ.ఉదయ్‌కుమార్, కార్పొరేటర్ వీరమాచినేని లలిత తదితరులు పాల్గొన్నారు.