
సాక్షి, హైదరాబాద్: పారిశుధ్య నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియ అని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఐదుగురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా పాత భవనాల కూల్చివేత, పడావుపడిన బావుల పూడ్చివేత, పనుల బిల్లుల చెల్లింపు విషయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకోవాలని ఈ దిశగా గ్రామ పంచాయతీలకు అధికారులు అవగాహన కల్పించాలని పేర్కొంది. శనివారం గ్రామీణ పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన మొదటిసారి సమావేశమైంది. సమావేశంలో మ్రంతులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.