జన్మభూమి గ్రామ సభకు రూ. 4వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
నేటికీ అందని సంక్రాంతి సంబరాల నిధులు
ఇప్పటికీ పలు పంచాయతీలకు విడుదల కాని జన్మభూమి నిధులు
సర్పంచ్‌లు, కార్యదర్శులకు భారంగా తయారైన ప్రభుత్వ కార్యక్రమాలు
అయ్యయ్యో..చేతిలో డబ్బులు పోయెనే..జేబులు ఖాళీ ఆయెనే..ఉన్నది కాస్తా ఊడింది..మొత్తం ఖర్చు అయ్యింది.. ప్రభుత్వం ఎప్పుడిస్తుంది.. అంటూ గ్రామస్థాయిలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు దీనంగా ఎదురుచూస్తున్నారు. ప్రచారం కోసం ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించే కార్యక్రమాలతో సర్పంచ్‌లు, అధికారులకు చేతి చమురు వదులుతోంది. నిధు లు విడుదల చేస్తాం. కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలన్న అధికారుల ఆదేశాలతో సర్పంచ్‌లు, కార్యదర్శులు బాధ్యత తీసుకుని మదుపులు ముందుగా పెట్టి కార్యక్రమాలు జరిపిస్తున్నారు. కార్యక్రమాలకు ఎంత ఖర్చు పెడితే అంత నిధులు విడుదలవుతాయన్న ఉద్దేశంతో సొంత డబ్బు వెచ్చిస్తున్నారు. తీరా కార్యక్రమాలు పూర్తయిపోయాక నిధులు విడుదల చేయాల్సిన ప్రభుత్వం జాప్యం చేస్తుండడం, కొన్ని చోట్ల ఆ నిధులు పక్కదారి పడుతుండడంతో జేబులు ఖాళీ చేసుకున్న సర్పంచ్‌లు, కార్యదర్శులు బిత్తర చూపులు చూస్తున్నారు.
విజయనగరం: జన్మభూమి గ్రామ సభకు రూ. 4వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతనెల 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు గ్రామాల్లో నిర్వహించిన జన్మభూమి గ్రామసభలకు షామియానా, కుర్చీలు, మైక్‌సెట్, అధికారులకు టీ, బిస్కెట్లు, మధ్యాహ్నం భోజనం తదితర ఏర్పాట్లకు సుమారు రూ.15వేల వరకు ఒక్కో పంచాయతీకి ఖర్చయింది. ఈ ఖర్చును కొన్ని చోట్ల అంగన్‌వాడీ కార్యకర్తలు, రేషన్‌డిపో డీలర్లు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు కలిసి భరించారు. కొన్నిచోట్ల మాత్రం సర్పంచ్‌లే ఏకంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గ్రామసభలు ముగిసి 25రోజులు కావస్తున్నా ఇప్పటికీ పలు పంచాయతీలకు వారు ఖర్చు పెట్టిన సొమ్ము విడుదల కాలేదు. జిల్లా అధికారుల్ని ప్రశ్నిస్తే ఎంపీడీఓలకు ఎప్పుడో విడుదల చేశామని చెబుతున్నారు. మండల స్థాయి అధికారుల్ని అడిగితే అప్పుడే
ఇచ్చేశామంటున్నారు కానీ చాలా పంచాయతీల్లో ఇప్పటికీ ఆ నిధులు రాలేదని సర్పంచ్‌లు, కార్యదర్శులు మొరపెట్టుకుంటున్నారు. గట్టిగా అడిగే సర్పంచ్‌లకు మాత్రమే ఈ నిధులొచ్చాయన్న వాదనలు ఉన్నాయి. మిగతా చోట్ల మండల స్థాయిలోనే నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇటీవల నిర్వహించిన సంక్రాంతి సంబరాల నిధులైతే ఏ ఒక్క పంచాయతీకి ఇంతవరకు అందలేదు. అసలు ఆ నిధులొచ్చాయా? వస్తే ఏమయ్యాయనే ఆందోళన అటు సర్పంచ్‌లు, ఇటు గ్రామ స్థాయి అధికారుల్లో ఉంది.
ఆర్భాటంగా సంబరాలు.. అందని నిధులు సంక్రాంతి సంబరాల ఆర్భాటమైతే చెప్పనక్కర్లేదు. పండగలా జరపాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. జిల్లాకు రూ. కోటి కేటాయించినట్టు ప్రకటించింది. కానీ, సంబరాలు జరిగి నేటికి 20రోజులు కావస్తున్నా చిల్లిగవ్వ కూడా పంచాయతీలకు చేరలేదు. నిర్వహణ వ్యయం ఎంతన్నది చెప్పకుండానే సంబరాలు ఘనంగా నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. ఎంత ఖర్చు పెడితే అంత వస్తుందనే ధీమాతో సర్పంచ్, కార్యదర్శులు ఎక్కడికక్కడ సంబరాలు నిర్వహించారు. పండగ వేళ కుటుంబాలతో సరదాగా గడపాల్సిన సమయంలో స్టాల్స్, ఫ్లెక్సీలు, వివిధ పోటీలంటూ బిజీ బిజీ అయ్యారు. అయితే వారికి అందాల్సిన ఖర్చు సొమ్ము నేటికీ అందలేదు.
ఇదే విషయమై ఆరాతీస్తే రూ. కోటి అన్న ప్రభుత్వం ఇటీవల కేవలం రూ.50లక్షలే విడుదల చేసినట్టు తెలిసింది. ఈ మొత్తం ఎటూ సరిపోదనుకున్నారేమో గాని ఆ నిధుల్ని వెంటనే మండలాలు, పంచాయతీలకు పంపించలేదు. మూడు రోజుల క్రితం మాత్రం మండల కేంద్రానికి రూ.50వేలు చొప్పున, మండలంలో ఉన్న పంచాయతీలన్నింటికీ రూ.50వేలు చొప్పున కేటాయిస్తూ విడుదల చేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఒక్కొక్క మండలంలో 25నుంచి 30కి పైగా పంచాయతీలుండగా వాటిన్నింటికీ ప్రభుత్వమిచ్చే రూ. 50వేలు ఎంతవరకు సరిపోతుందన్న ఉద్దేశంతో పక్కన పెట్టినట్టు తెలిసింది. పంపకాలెందుకులే అని కొన్నిచోట్ల జన్మభూమి నిధులు మాదిరిగానే తమ జేబుల్లో వేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. నిధులు విడుదలయ్యాయి
జన్మభూమి నిధుల విషయమై సీపీఓ విజయలక్ష్మీ వద్ద ’సాక్షి’ ప్రస్తావించగా జన్మభూమి నిధులు అప్పుడే విడుదల చేశామని, ఒకవేళ ఏ పంచాయతీకైనా రాకపోతే వెంటనే ఎంపీడీఓను ఆశ్రయించాలని సూచించారు.సంక్రాంతి సంబరాల నిధుల విషయమై కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమణమూర్తిని ’ సాక్షి’ వివరణ కోరగా రూ.50లక్షల వరకు జిల్లాకొచ్చాయని, వాటిలో మండలానికి రూ. 50వేలు, మండలంలో ఉన్న పంచాయతీలన్నింటికీ రూ.50వేలు చొప్పున ఇటీవల విడుదల చేశామని చెప్పారు. అన్ని పంచాయతీలకు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.