వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం భక్తులను స్వామి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు.
* ఆన్‌లైన్‌లో 10 వేల టికెట్ల కేటాయింపు: టీటీడీ ఈవో
తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శ నం భక్తులను స్వామి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. జనవరి 1న వచ్చిన వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఈవో వివిధ విభాగాల అధికారులతో శుక్రవారం సమీక్షించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవరి 1న వేకువజామున 1.45 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. నేరుగా వచ్చిన వీఐపీతో పాటు మరో ముగ్గురికే దర్శనం కల్పిస్తామని, సిఫార్సు లేఖ లకు దర్శనాలు ఉండవన్నారు. అనుకున్నదాని కంటే ముందే సర్వదర్శనం భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తామన్నారు.
ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న 10 వేల మంది భక్తులకు ద్వాదశి రోజున దర్శనం ఉంటుందన్నారు. ఈ టికెట్లను ఈ నెల 24వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఆన్‌లైన్‌లో కేటాయిస్తామన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున 9 గంటలకు బంగారు రథం ఊరేగింపు, ద్వాదశి రోజున ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య చక్రస్నానం నిర్వహిస్తామన్నారు. రెండు పర్వదినాల సం దర్భంగా నాలుగు లక్షల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు.