
సర్వభక్ష అభియాన్
విశాఖ సర్వశిక్ష అభియాన్.. సర్వభక్ష అభయాన్‌లా మారింది. కాసులు కురిపించే కామధేనువులా తయారైంది
సాక్షి, విశాఖపట్నం : విశాఖ సర్వశిక్ష అభియాన్.. సర్వభక్ష అభయాన్‌లా మారింది. కాసులు కురిపించే కామధేనువులా తయారైంది. స్వచ్ఛభారత్‌లో భాగంగా సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1014 మరుగుదొడ్ల నిర్మాణానికి ఏప్రిల్ 20న ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్లాబుతో ఉన్న టాయిలెట్‌కు రూ.లక్షా 76 వేలు, ఓపెన్ టాయిలెట్‌కు 86 వేల చొప్పున సుమారు రూ.13 కోట్లు విడుదలయ్యాయి. వీటి నిర్మాణ బాధ్యతను స్కూలు మేనేజిమెంట్ కమిటీలకు అప్పగించారు. ఆగస్టు 15 నాటికి వీటిని పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా 70 శాతం కూడా పూర్తికాలేదని అంటున్నారు.
ఒక్కో మరుగుదొడ్డికి మంజూరైన నిధుల్లో 10 శాతం ప్రాజెక్టు అధికారి, ఇంజినీరింగ్ అధికార్లు, సైట్ ఇంజినీర్లు మరో ఐదు శాతం కమీషన్లుగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణను వీరు పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. దీనిపై లక్ష్యం మేరకు నిర్మాణాలు పూర్తవుతున్నాయంటూ తప్పుడు నివేదికలిస్తూ వస్తున్నారు.
వాస్తవానికి, నివేదికలకు పొంతన లేదన్న అనుమానంతో మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఆనందపురం మండలం బంటుపల్లి కళ్లాలు స్కూలు మరుగుదొడ్ల పరిశీలనలో ఈ వ్యవహారం వెలుగు చూడడం, పీవో, ఈఈలను మాతృ సంస్థలకు సరెండర్ చేయడం తెలిసిందే. కాగా ఎస్‌ఎస్‌ఏ కార్యాలయంలో ఓ కాంట్రాక్టు ఉద్యోగిని కూడా మరుగుదొడ్ల వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది. ఈ అవకతవకలపై లోతుగా దర్యాప్తు జరిపితే మరిన్ని వెలు గు చూసే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.
పీవో, ఓఎస్‌డీగా ద్విపాత్రాభినయం.. : సర్వశిక్ష అభియాన్ ప్రస్తుత పీవో నగేష్ మంత్రి గంటాకు కొన్నాళ్ల నుంచి ఓస్‌డీగా కూడా ఉంటూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని మంత్రి వెంట తరచూ తిరగాలంటూ ఇన్నోవా కారును అద్దెకు తీసుకున్నారు. ఇప్పటిదాకా పనిచేసిన ప్రాజెక్టు అధికారులు టాటా ఇండికా కార్లలోనే తిరిగే వారు. ఇండికా కారుకు నెలకు రూ.25 వేలు చెల్లిస్తే సరిపోయేదని, కానీ ఇన్నోవా కారుకు అంతకు రెట్టింపు రూ.60 వేలకు పైగా చెల్లిస్తున్నారని తెలిసింది.
అంతేకాదు.. మంత్రితో వెళ్తున్నట్టు టీఏ, డీఏలు డ్రా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో ఏజేసీ ద్వారా ఎస్‌ఎస్‌ఏ ఫైళ్లు వెళ్లేవని, ఆయన అభ్యంతరాలు చెబుతున్నారంటూ ఇటీవల వాటిని ఓఎస్‌డీ హోదాలో నేరుగా కలెక్టర్‌కే పంపేస్తున్నారని చెబుతున్నారు. సాక్షాత్తూ మంత్రి గంటానే పీవో కమ్ ఓఎస్‌డీ నగేష్, ఈఈ భానుప్రసాద్‌లను ప్రభుత్వానికి సరెండర్ చేయడం చర్చనీయాంశమైంది. నేడో రేపో నగేష్ బదిలీ అవుతారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో మాతృసంస్థకే సరెండర్ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.