సమైక్య జోరు
Published Sun, Aug 18 2013 5:32 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లాలో జరుగుతున్న ఉద్యమం శనివారం 18వ రోజూ ఉధృతంగా సాగింది. నెల్లూరు నగరంలో ఆర్టీసీ ఉద్యోగులు ఆర్టీసీ బస్టాండ్ నుంచి వీఆర్‌సీ వరకు ర్యాలీ నిర్వహించారు. వీఆర్‌సీ కూడలిలో సమైక్య ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష, వీఎస్‌యూ ఆధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్‌సీ కూడలిలో నిరాహారదీక్ష చేపట్టారు. గూడూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు మోటార్‌బైక్ ర్యాలీ, అల్లూరులో వైఎస్సార్‌సీపీ నేతలు 150 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. నగరంలో ములుమూడి బస్టాండ్ సెంటర్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానికులు రిలేదీక్ష చేపట్టారు.
కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలో కూర్చున్న ఎన్‌జీఓ సంఘం నాయకులకు జిల్లా అధికారులు, వైఎస్సార్‌సీపీ నగర నియోజకవర్గ సమన్వయకర్త అనిల్‌కుమార్ యాదవ్ సంఘీభావం తెలిపారు. గూడూరులో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు పాశం సునీల్‌కుమార్, డాక్టర్ బాలచెన్నయ్య, నాయకులు బత్తిని విజయకుమార్ సమైక్యాంధ్ర ఆందోళనలో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు బత్తిని విజయకుమార్ ఆధ్వర్యలో గూడూరులో భారీ మోటార్‌సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ కార్మికులతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించి, పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.
పొదలకూరులో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు.
కావలిలో శ్రీపొట్టిశ్రీరాములు సెంటర్ వద్ద సైమైక్యాంధ్ర జేఏసీ శిబిరంలో తుమ్మలపెంట, సర్వాయిపాలెం, జలదంకి పీహెచ్‌సీల వైద్య సిబ్బంది రిలేనిరాహార దీక్షకు దిగారు. స్థానిక ఆర్టీసీ ఉద్యోగుల సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యాన పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కావలి ఆర్టీసీ డిపో నుంచి వెళ్తున్న బస్సులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అల్లూరులో 150 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.
ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్‌లో నీటిపారుదల శాఖ సిబ్బంది, అధికారులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.
నెల్లూరు పాళెం వంతెన వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఆర్టీసీ బస్సుకు ముందు టైర్లలో గాలి తీశారు. దీంతో నెల్లూరు- ముంబయి రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఉదయగిరిలో ఆర్టీసీ కార్మికులు, వివిధ సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి పంచాయతీ బస్టాండ్ వరకు ర్యాలీ జరిగింది. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. వైఎస్సార్‌సీపీ పట్టణ యూత్ ఆధ్వర్యంలో స్థానిక హైస్కూల్ వద్ద యువకులు రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై వాలీబాల్ ఆడారు. కొండాపురం మండ లం సత్యవోలులో గ్రామస్తులు కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలు దహనం చేసి రోడ్డుపై నిరసన తెలిపారు.
సూళ్లూరుపేటలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో విభజనకు వ్యతిరేకంగా సుమారు 300 మంది మహిళలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరో సమన్వయకర్త నెలవల సుబ్రమణ్యం, పార్లమెంట్ ఇన్‌చార్జి వెలగపల్లి వరప్రసాద్ పాల్గొన్నారు.
కోవూరు ఎన్జీఓ హోంలో సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ నాయకుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఇందుకూరుపేటలో వైఎస్సార్‌సీపీ నాయకుడు గునపాటి సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు.
Advertisement
Advertisement