ఈ నిర్మాణాలు త్వరలోనే పునఃప్రారంభం
బొబ్బిలి: ఆశ్రిత పక్షపాతం, స్వప్రయోజనం గత ప్రభుత్వ విధానమైతే... ప్రజా సంక్షేమం, ఖజానాపై భారం తగ్గడం తాజా పాలకుల లక్ష్యం. అదే ఉద్దేశంతో రూపొందించిన రివర్స్ టెండరింగ్ విధానం జిల్లాలో మంచి లాభాలను చేకూర్చింది. గత ప్రభు త్వం జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలు, ఒక నగ ర పంచాయతీలో చేపట్టిన అర్బన్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణం ఖజానాపై పెనుభారం మోపింది. ఎంతోమంది నిరుపేదలు ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నా... వారిని పట్టించుకోకుండా కేవలం జన్మభూమి కమిటీలు సిఫారసు చేసిన తమ సొంతవారికే వాటిని కట్టబెట్టింది. అలా మంజూరైన ఇళ్ల కాంట్రాక్టును అప్పట్లో విజయ్‌నిర్మాణ్ సంస్థకు పెద్ద మొత్తానికి అప్పగించింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం 20శాతం లోపు నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టును రద్దు చేసి రివర్స్ టెండర్‌కు పిలవాలని నిర్ణయించడంతో బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మునిసిపాలిటీల్లోని ఇళ్లను కొత్త కంపెనీ తక్కువకు దక్కించుకుని ఖజానాకు రూ. 22కోట్లు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఆ మూడు మున్సిపాలిటీల్లో గతంలో రూ.148 కోట్లకు విజయనిర్మాణ్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంటే రివర్స్ టెండరింగ్‌లో రూ.126 కోట్లకే ఇంద్రజిత్ మెహర్ కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థ దక్కించుకుంది. ఈ పరిణామంతో ఇక పట్టణ గృహ నిర్మాణాలు వేగవంతం అవుతాయని లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
20శాతం లోపు పనులు నిలుపుదల
జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలకు మంజూరైన ఇళ్ల నిర్మాణ బాధ్యతను గతంలో విజయనిర్మాణ్ సంస్థ దక్కించుకుంది. అందులో బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మునిసిపాలిటీలకు మంజూరైన ఇళ్ల నిర్మాణం 20శాతానికి మించలేదు. అందుకే ఈ మూడింటికి కొత్తగా రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త కాంట్రాక్ట్ పొందిన ఇంద్రజిత్ మెహర్ కంపెనీ పాత కంపెనీ ధరల కంటే 14.78 శాతం తక్కువకు కోట్‌చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీకి టెండర్లు ఖరారు చేసింది. ప్రభుత్వం క్లియరెన్స్ లెటర్ ఇచ్చాక పనులు ప్రారంభించేందుకు కొత్త సంస్థ సిద్ధంగా ఉంది. గత కాంట్రాక్టు పెద్ద మొత్తానికి వెళ్లినట్టు గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్మాణాలపై పలుమార్లు నివేదికలు కోరింది. మున్సిపల్ కమిషనర్లు, టిడ్కో ఇంజినీర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా వారి అనుమానం నిజమన్న విషయం తేటతెల్లమైంది. వెంటనే 20శాతం కంటే తక్కువ పనులు చేపట్టిన మూడు మునిసిపాలిటీలకు రివర్స్ టెండరింగ్ అమలు చేసింది.
ఊపందుకోనున్న నిర్మాణాలు
జిల్లాలోని బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు అర్బన్ హౌసింగ్ నిర్మాణాలకు కొత్త కాంటాక్టరుకు అప్పగించడంతో ఇక పనులు చురుకుగా సాగే అవకాశం ఉందని లబి్ధదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు మునిసిపాలిటీల్లో ఈ సంస్థ 3072 ఇళ్లను నిర్మించనుంది. జిల్లా వ్యాప్తంగా 7,677 ఇళ్లను నిర్మించేందుకు అప్పట్లో పనులు చేపడితే మూడు మున్సిపాలిటీల్లో 3072 ఇళ్లకు మాత్రమే రివర్స్ టెండరింగ్‌కు పిలిచారు. విజయనగరంలో పనులు పూర్తవగా, నెల్లిమర్లలో అసలు టెండర్లు పిలవలేదు.
కొద్ది రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం
జిల్లాలోని మున్సిపాలిటీల్లో చేపట్టే ఇళ్ల నిర్మాణాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అర్బన్ ఇళ్ల నిర్మాణానికి గత కాంట్రాక్టును నిలిపివేసిన ప్రభుత్వం కొత్తగా రివర్స్ టెండరింగ్ పిలిచింది. కొత్తగా మూడు మున్సిపాలిటీల్లో 3072 ఇళ్ల నిర్మాణానికి 14.78 శాతం తక్కువకు కోట్ చేసిన ఇంద్రజిత్ మెహర్ కన్‌స్ట్రక్షన్స్‌కు టెండర్ దక్కింది. ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ ఏక్సెప్టెన్సీ వచ్చాక సంస్థ పనులు ప్రారంభించనుంది. మరి కొద్ది రోజుల్లో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కానుంది.
– మామిడి శ్రీనివాస్, ఈఈ, టిడ్కో హౌసింగ్
Comments
Please login to add a commentAdd a comment