‘రివర్స్‌’ మరోసారి సూపర్‌హిట్‌ | Saving funds in Nala drain development works | Sakshi
Sakshi News home page

‘రివర్స్‌’ మరోసారి సూపర్‌హిట్‌

Published Thu, Nov 14 2019 5:23 AM | Last Updated on Thu, Nov 14 2019 5:23 AM

Saving funds in Nala drain development works - Sakshi

సాక్షి, అమరావతి: అంచనా వ్యయం రూ.పది లక్షలు దాటిన ప్రతి పనికీ ‘రివర్స్‌ టెండరింగ్‌’ నిర్వహించాలని ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న విధానపరమైన నిర్ణయం తిరుగులేనిదని మరోసారి నిరూపితమైంది. ఒంగోలును ముంపు నుంచి తప్పించే పోతురాజు నాలా డ్రెయిన్‌ అభివృద్ధి పనులకు నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌లో తాజాగా ఖజానాకు రూ.15.62 కోట్లు ఆదా అయ్యాయి. ఇక వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనులకు నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఇప్పటివరకు ఖజానాకు మొత్తం రూ.1,228.95 కోట్లు ఆదా అయ్యాయి. 


ప్రైస్‌ బిడ్‌లోనే రూ.3.91 కోట్లు ఆదా
తొలిదశలో పోతురాజు నాలా వెడల్పు పనులను రూ.12.50 కోట్లతో  చేపట్టారు. రెండో దశలో రూ.89.75 కోట్లతో అభివృద్ధి పనులకు జూలై 23న జలవనరులశాఖ పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ పనులకు రూ.78.14 కోట్ల అంచనా వ్యయంతో సెప్టెంబరు 28న జలవనరుల శాఖ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయగా ఎనిమిది సంస్థలు షెడ్యూళ్లు దాఖలు చేశాయి. ఒంగోలు ప్రాజెక్ట్స్‌ ఎస్‌ఈ నగేష్‌ మంగళవారం ప్రైస్‌ బిడ్‌ తెరవగా ఐదు శాతం తక్కువ ధరకు అంటే రూ.74.24 కోట్లకు కోట్‌ చేస్తూ షెడ్యూలు దాఖలు చేసిన కాంట్రాక్టు సంస్థ ఎల్‌–1గా నిలిచింది. ప్రైస్‌ బిడ్‌ స్థాయిలోనే ఖజానాకు రూ.3.91 కోట్లు ఆదా అయ్యాయి.

ఆ తర్వాత ప్రైస్‌ బిడ్‌లో ఎల్‌–1గా నిలిచిన సంస్థ కోట్‌ చేసిన ధర అంటే రూ.74.24 కోట్లను అంచనా విలువగా పరిగణించి ఈ–ఆక్షన్‌(రివర్స్‌ టెండరింగ్‌) నిర్వహించారు. షెడ్యూళ్లు దాఖలు చేసిన ఎనిమిది సంస్థలు ఈ–ఆక్షన్‌లో నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి. ఈ–ఆక్షన్‌ కాల పరిమితి ముగిసే సమయానికి 20 శాతం తక్కువకు అంటే రూ.62.52 కోట్లకు కోట్‌ చేసిన సిరి కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ ఎల్‌–1గా నిలిచింది. అదే సంస్థకు పనులు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలంటూ సీవోటీ(కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌)కి బుధవారం ప్రతిపాదనలు పంపారు. రూ.78.14 కోట్ల అంచనా వ్యయంతో నిర్వహించిన టెండర్లలో ఖజానాకు రూ.15.62 కోట్లు ఆదా కావడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement