పొదుపు కాంతులు
- ఎల్‌ఈడీ బల్బుల వినియోగంలో గిరిజనుల ఘనత
- గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్సుకు సిఫారసు
పాడేరు: విశాఖ జిల్లా పాడేరు మండలం డి.గొందూరు, బర్సింగి పంచాయతీల్లో 1002 మంది విద్యుత్ వినియోగదారులు ఎల్‌ఈడీ బల్బులను అమర్చుకొని ప్రపంచ స్థాయిలోనే రికార్డు సాధించారని పంచాయతీ విస్తరణ అధికారి(పీఈవో) కె.వెంకన్నబాబు తెలిపారు. ప్రభుత్వం విద్యుత్ పొదుపునకు ప్రాధాన్యమిస్తోంది. పెలైట్ ప్రాజెక్టుగా నాలుగు జిల్లాల్లో రూ.10కే ఎఈడీ బల్బులు పంపిణీకి నిర్ణయించింది. ఈ కార్యక్రమం అమలు కాకమునుపే విశాఖ జిల్లాలోని మారుమూల గిరిజన పంచాయతీల్లోని ఆదివాసీలు ఎల్‌ఈడీ బల్బుల వినియోగంతో విద్యుత్‌ను పొదుపు చేయడం విశేషం. ఈ మేరకు
గురువారం ఆయా గ్రామాలను పీఈవో సందర్శించారు. ఎల్‌ఈడీ బల్బులు వినియోగిస్తున్న గిరిజనులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గతంలో సీఎఫ్‌ఎల్ బల్బులను నాతవరం మండలం ఎస్.బి.పట్నంలో అమర్చినందుకు తెలుగుబక్‌ఆఫ్ రికార్డుల్లో నమోదయిందన్నారు.
అదే తరహాలో ఈ రెండు పంచాయతీల గిరిజనులు కూడా ఎల్‌ఈడీ బల్బులను వినియోగించి విద్యుత్ పొదుపుకు స్పూర్తిగా నిలిచారని తెలిపారు. దీనికి ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చేలా గిన్నీస్‌బుక్ ఆఫ్ రికార్డ్సు జ్యూరీ అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. డి.గొందూరు, బర్సింగి సర్పంచ్‌లు సీదరి రాంబాబు, సీదరి పార్వతమ్మ, న్యాయవాది కొండలరావులను అభినందించారు.