
భవనాలు ఇలా..బోధన ఎలా?
నలభై రోజులు వేసవి సెలవుల అనంతరం తిరిగి సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయి.
చాలా చోట్ల శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలు
పీడిస్తున్న గదుల కొరత
బోధనకు వరండాలే గతి
కనీస సౌకర్యాలు కరువు
నేడు పాఠశాలలు పునఃప్రారంభం
రాప్తాడు: నలభై రోజులు వేసవి సెలవుల అనంతరం తిరిగి సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయి. వేసవి సెలవులను వారి సొంత గ్రామాలతో పాటు బందువుల గ్రామాలకు వెళ్లి సంతోషంగా గడిపిన విద్యార్థులు తిరిగి నేటి నుంచి బడి బాట పట్టనున్నారు. ఇదిలా ఉండగా మౌలిక సదుపాయాల కొరత, సమస్యలు విద్యార్థులకు తొలి రోజే స్వాగతం పలకనున్నాయి. ఏ పాఠశాలలో చూసినా గదుల కొరత, శిథిలావస్థలో ఉన్న గదులు దర్శనమిస్తున్నాయి. విద్యాభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
రాప్తాడు మండలంలో ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపాలంటే తల్లిదండ్రులు జంకాల్సిన పరిస్థితి నెలకొంది. మండల వ్యాప్తంగా 35 పాఠశాలలు ఉండగా, అందులో 6 ఉన్నత, 7 ప్రాథమికొన్నత, 22 ప్రాథమిక పాఠశాలలున్నాయి. దాదాపుగా 23 పాఠశాలల్లో భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఒక్కొక్క పాఠశాలలో రెండు, మూడు గదులు వర్షానికి కారుతున్నాయి. అవి ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. రాప్తాడు, ప్రసన్నాయపల్లి, అయ్యవారిపల్లి, బుక్కచెర్ల, గాండ్లపర్తి, వరిమడుగు, ఎం. బండమిదపల్లి, యర్రగుంట, మరూరు, హంపాపురం, పాలచేర్ల, బోగినేపల్లి పాఠశాలల్లో తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. పాఠశాల భవనం కూలి నాలుగేళ్ల క్రితం ఓ విద్యార్థి ప్రాణలు కొల్పోయాడు. దీంతో గుప్పెట్లో ప్రాణలు పెట్టుకొని పాఠాలు నేర్చుకొవాల్సి వస్తోంది. వీటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించాలని మూడేళ్ల కిందట అప్పటి విద్యాధికారి రాఘవయ్య ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు.
దీంతో శిథిలావస్థలో ఉన్న భవనాల్లో తరగతులు నిర్వహించవద్దని అధికారులు అయా పాఠశాలల హెచ్‌ఎంలకు సూచించారు. అవసరమైతే రెండు క్లాసులను ఒకేచోట బోధించాలని సూచిస్తున్నారు. అయితే రెండు తరగతులు కలిపితే గందరగోళం తప్ప విద్యార్దులకు పాఠాలు పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవడం కష్టమే. విద్యార్థులు చదువుకునేందుకు అనువైన పరిస్థితులు కల్పించేలా పాఠశాలలను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కొరుతున్నారు. ఈవిషయంపై ఎంఈఓ మల్లికార్జునను వివరణ కొరగా శిథిలావస్థకు చేరిన పాఠశాలల వివరాలను ఉన్నతాధికారులకు నివేదికలు పంపామన్నారు. నిధులు మంజూరైన వెంటనే గుర్తించిన గ్రామాల్లో కొత్త భవనాలు నిర్మించి విధ్యార్థుల విధ్యాభివృద్దికి పాటుపడుతామని ఆయన తెలిపారు.
చెన్నేకొత్తపల్లి మండలంలోని 41 ప్రాథమిక,11 ప్రాథమికోన్నత,7 ఉన్నత పాఠశాలలతోపాటు మండల కేంద్రమంలోని బాలుర, బాలికల వసతి గృహాలు పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో అవసరమైన బ్యాగులు, పుస్తకాలు,నోట్ బుక్కులు కొనేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా పలు పాఠశాలల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అనేక పాఠశాలల్లో చేతి పంపులు, కొళాయిలు ఉన్నా పని చేయడం లేదు. ఈ విద్యాసంవత్సరంలోనైనా తాగునీటి సమస్య తీర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.