
రవితేజ తల్లిదండ్రులను çపరామర్శిస్తున్న అర్జేడీ శ్రీనివాసరెడ్డి , రవితేజ (ఫైల్)
గుంటూరు ఈస్ట్: కాలిన గాయాలతో గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న ఏడో తరగతి విద్యార్థి మెట్లు రవితేజ (14) శుక్రవారం మృతి చెందాడు. ప్రకాశం జిల్లా అర్ధవీడులో ఈ నెల 7వ తేదీన ఏడో తరగతి విద్యార్థి మెట్లు రవితేజపై ఇంటర్ చదువుతున్న రంజిత్ కుమార్ పెట్రోలు పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. 95 శాతంపైగా కాలిన గాయాలతో జీజీహెచ్‌లో వారం రోజులుగా చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. అతని తండ్రి మెట్లు శేఖర్, తల్లి వెంకటలక్ష్మీ నరసమ్మ, బంధువులు కుమారుడి మరణంతో కన్నీరుమున్నీరయ్యారు.
అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ అర్ధంతరంగా తనువు చాలించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి రోదనలు అత్యవసర విభాగంలో అందరికీ కన్నీరు తెప్పించాయి. శేఖర్ అంగవైకల్యం కారణంగా పెద్ద కుమారుడైన రవితేజ భవిష్యత్తులో తనను, కుటుంబాన్ని ఆదుకుంటాడని పెట్టుకున్న ఆశలన్ని అడియాసలు కావడమే కాక.. కొద్ది రోజులుగా తీవ్ర గాయాలతో కుమారుడు కళ్ల ముందే పడ్డ నరకయాతన తలుచుకుంటూ వారు దుఃఖసాగరంలో మునిగిపోయారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
ఆర్జేడీ పరామర్శ
పాఠశాల విద్య ఆర్జేడీ శ్రీనివాసరెడ్డి, ఉర్దూ ఉప తనిఖీ అధికారి షేక్ ఎండీ ఖాసిం, అర్ధవీడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఐ.వెంకటేశ్వర్లు జీజీహెచ్ చేరుకుని రవితేజ తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆర్జేడీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తమ విభాగం నుంచి సహాయంగా లక్ష రూపాయలు రవితేజ తల్లిదంద్రులకు అందచేయనున్నట్లు చెప్పారు. రవితేజ తండ్రి శారీరక అంగవైకల్యం కారణంగా మరింత సహాయం అందజేసేందుకు జిల్లా అధికారులను కోరినట్లు చెప్పారు.