నువ్వా- నేనా?
- తిరుపతి దేశం నేతల్లో విభేదాలు
- కడుపులో కత్తులు పెట్టుకుని పైకి కౌగిలించుకుంటున్న నాయకులు
సాక్షి, తిరుపతి: తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. టికెట్టు తనకే అని చదలవాడ కృష్ణమూర్తి ధీమాగా ప్రకటిస్తున్నారు. భూకబ్జాదారులకు టికెట్టు వచ్చే ప్రసక్తే లేదని పరోక్షంగా వెంకటరమణను విమర్శిస్తున్నారు. వెంకటరమణ మాత్రం బయటపడకుండా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. మరోవైపు తనకు సేవారంగంలో మంచి గుర్తింపు ఉందని, కొత్తవాడినైన తనకు టికెట్టు ఇవ్వాలని డాక్టర్ హరిప్రసాద్ కోరుతున్నారు.
బాబు ఎవరికీ హామీ ఇవ్వకుండా ఉండేసరికి ఎవరికి వారు వేర్వేరుగా ప్రచారం చేసుకుంటున్నారు. విషయమేంటంటే ఒకరి తరువాత ఒకరుగా పార్టీలో చేరిన నాయకుల మధ్య సఖ్యత లేకపోగా అప్పటికే పార్టీ జెండాలు భుజాన వేసుకున్న శ్రేణులతో వీరికి అసలు పొసగడం లేదు. ఈ నాయకులంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఒకరి గుట్టు ఒకరికి ఏదో రకంగా చేరిపోతోంది. దీంతో ఆయా నాయకులు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే పరిస్థితి ఉంది.
నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న చదలవాడ కృష్ణమూర్తి, పీఆర్పీ మాజీ నేత ఊకా విజయకుమార్, కాంగ్రెస్ నుంచి టీడీపీ గొడుగు కిందకు చేరిన మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, డాక్టర్ హరిప్రసాద్ తదితరులు ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందరూ టికెట్టు ఆశిస్తున్న వారే కావడం గమనార్హం. వీరంతా పూర్వపు పరిచయాలను ఉపయోగించుకుని ఒకరి శిబిరం గురించి మరొకరు ఆరా తీస్తున్నారు.
కొందరు కార్యకర్తలకు ఇదే పనిగా మారింది. పగలంతా ఒక నేతతో ఉంటూ రాత్రికి మరో నేత దగ్గరకు వెళ్లి అక్కడి విషయాలు పూసగుచ్చినట్టు వివరిస్తున్నట్టు తెలిసింది. ఇటువంటి కోవర్టులను అందరు నాయకులు ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా పరస్పర ఆరోపణలకు కూడా దిగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరమణను భూకబ్జా కోరుగా చదలవాడ కృష్ణమూర్తి అభివర్ణించారు.
ఆయన అనుచరులతో కూడా వెంకటరమణపై ఆరోపణలు చేయించారు. దీంతో తిరుపతి టీడీపీలోని లుకలుకలు బయటపడుతున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన వారు ఎవరి ఇష్టానుసారం వాళ్లు కార్యక్రమాలు నిర్వహిస్తే సహించేది లేదంటూ హెచ్చరికలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎవరికి టికెట్టు ఇచ్చినా మిగిలిన వారు పనిచేస్తారనే నమ్మకం పార్టీ శ్రేణుల్లో లేదు.
టీటీడీ వేదపండితులతో సుజనాచౌదరికి ఆశీర్వాదం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ అసెంబ్లీ టికెట్టు కోసం పడరానిపాట్లు పడుతున్నారు. ఉగాది పర్వదినం రోజున తిరుపతి నుంచి వెంటబెట్టుకుని వెళ్లిన టీటీడీ వేదపండితులతో రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరికి ఆశీర్వాదాలు అందజేసినట్టు తెలిసింది. జిల్లాలో అసెంబ్లీ టిక్కెట్ల వ్యవహారాల బాధ్యతలు చూస్తున్న సుజనాచౌదరిని మచ్చిక చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే వేసిన ఎత్తుగడగా చదలవాడ వర్గీయులు విమర్శిస్తున్నారు.
కాగా ఊకా విజయకుమార్, డాక్టర్ హరిప్రసాద్‌లను తన వైపు తిప్పుకునేందుకు వెంకటరమణ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చదలవాడకు వ్యతిరేకంగా అందరిని ఒకతాటిపైకి తీసుకురావడం ద్వారా తనకు ఎదురులేకుండా చేసుకునేందుకు వెంకటరమణ పావులు కదుపుతున్నారు. మొత్తానికి తిరుపతి టీడీపీలో జరుగుతున్న పరిణామాలు ఇతర పార్టీల వారికి వినోదంగా మారాయి.