సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జెడ్పీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఈ నెల 5వ తేదీ వీరంగం సృష్టించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విషయంలో పోలీసులు అనుకున్నదే చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి నాన్‌బెయిలబుల్ సెక్షన్లను తొలగించి, నామమాత్రపు సెక్షన్లతో స్టేషన్ బెయిలిచ్చారు.
సాక్షాత్తు జిల్లా ఉన్నతాధికారితోనే దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి నగరంలో అనుచరులతో ర్యాలీ నిర్వహించినా పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసు విషయంలో మొదటి నుంచి పోలీసుల తీరు వివాదాస్పదంగా ఉంది. ఘటన జరిగిన రోజే జెడ్పీ సీఈఓ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే రామకృష్ణపై కేసు నమోదైంది. ప్రజల ఆస్తులకు నష్టం కలిగించేలా ప్రవర్తించాడని 363, 447 సెక్షన్లతో కేసు నమోదు చేయడంతో పాటు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. అయితే అసలు డ్రామా అక్కడి నుంచే మొదలైంది. జెడ్పీ సమావేశ మందిరంలో వీరంగం సృష్టించిన రామకృష్ణ ఆ రోజు రాత్రి టెక్కేమిట్ట పావనీటవర్స్‌లోని తన ఇంట్లోనే ఉన్నారు.
పోలీసులకు ఈ విషయం తెలిసినా ఊరుకున్నారు. తర్వాత రోజు ఆయన హైదరాబాద్ వెళ్లాక అరెస్ట్ అంటూ మీడియాకు సమాచారం ఇచ్చి ఎమ్మెల్యే ఇంటి వద్ద హడావుడి సృష్టించారు. అనంతరం రామకృష్ణను అరెస్ట్ చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామంటూ ప్రకటనలిచ్చారు. ఈ క్రమంలోనే గురువారం టీడీపీ నేత సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రామకృష్ణ ఏ పాపం ఎరుగడని, కలెక్టర్‌పై దాడి చేయలేదని, ఆయనపై పెట్టిన నాన్‌బెయిలబుల్ కేసును ఉపసంహరించుకోవాలని కోరారు. ఆయనపై కేసుల తీవ్రతను తగ్గించాలని సూచించారు. చెప్పింది అధికార పార్టీ నేతలు కావడంతో పోలీసులు తూ..చ తప్పకుండా పాటించారు. రామకృష్ణపై నాన్‌బెయిలబుల్ సెక్షన్లు తొలగించి 186, 187, 189 సెక్షన్ల(బెయిలబుల్)తో కేసు నమోదు చేశారు.
నెల్లూరులో కార్ల ర్యాలీ
నాన్‌బెయిలబుల్ కేసు నమోదైన తర్వాత హైదరాబాద్ వెళ్లిన రామకృష్ణ అక్కడి నుంచే చక్రం తిప్పారు. అంతా అనుకున్నట్టు జరిగాక, జెడ్పీ చైర్మన్ ఎన్నికకు ఒక రోజు ముందు శనివారం సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరుకు చేరుకున్నారు. ఏదో ఘనత సాధించినట్టుగా సుమారు 40 కార్లతో ర్యాలీగా ఇంటికి వెళ్లారు. ఇంటి దగ్గర పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం రామకృష్ణ నేరుగా ఒకటో నగర పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. కోర్టు, విచారణ లేకుండానే పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు .
దీంతో రామకృష్ణ దర్జాగా ఇంటికి తిరిగెళ్లారు. నెల్లూరులో ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నా పోలీసుస్టేషన్‌కు వచ్చేంత వరకు ఆయన ఆచూకీ తెలియనట్టు పోలీసులు వ్యవహరించడం గమనార్హం. రామకృష్ణ నగరంలో అడుగుపెట్టడం నుంచి బెయిల్ పొందడం వరకు హైడ్రామా నడిచింది. ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉద్యోగుల్లో ఆందోళన
కలెక్టర్‌తో ఎమ్మెల్యే రామకృష్ణ వ్యవహరించిన తీరుపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. పోలీసులు ఇవేమి పట్టించుకోకుండా అధికార పార్టీ నేతల మెప్పు పొందేందుకు ఎమ్మెల్యేపై ఈగ వాలకుండా చూసి ఇంటికి పంపారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం జరగనున్న జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో ఆయన మళ్లీ ఎలాంటి వీరంగం సృష్టిస్తారోనని అందరూ ఆందోళన చెందుతున్నారు.
సెక్షన్ల తారుమారు
Published Sun, Jul 13 2014 2:40 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement