సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కేంద్ర మంత్రివర్గం తెలంగాణ నోట్‌ను ఆమోదించడంతో గురువారం జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టెక్కలిలో కేంద్ర మంత్రి కృపారాణి ఇంటిని ముట్టడించారు. ఆమె లేకపోవడంతో అక్కడే వంటావార్పు.. భోజనాలు చేసి.. ధర్నా నిర్వహించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రం నుంచి ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు హాజరయ్యారు. మంత్రి పదవిపై మోజు తప్ప కృపారాణికి ప్రజా ప్రయోజనాలు పట్టడం లేదని వారు విమర్శించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే కళ్లున్న కబోదుల్లా వ్యవహరించటమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికే పలుమార్లు మంత్రిని కలిసి విన్నవించినా ఎలాంటి ప్రయోజనం దక్కలేదని వాపోయారు.
రాజాంలో సమైక్యవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని పీకివేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. అక్కడినుంచి నేరుగా మంత్రి కోండ్రు మురళీమోహన్ క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లి బైఠాయించారు. మంత్రి పదవికి రాజీనామా చేసి వెంటనే సమైక్య ఉద్యమంలోకి రాకుంటే రాజకీయ జీవితమే లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాతపట్నంలో అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు క్యాంపు కార్యాలయాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. ఆయన తీరుపై మండిపడ్డారు. వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీ నోట్‌పై కేంద్ర మంత్రివర్గం చర్చిస్తోందని తెలిసినా చీమకుట్టినట్లు కూడా లేకుండా పోయిందని నిరసించారు. పాతపట్నంలో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. మెళియాపుట్టిలో బంద్ పాటించారు. ఆమదాలవలసలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు కలిసి బంద్‌కు పిలుపునివ్వటంతో వ్యాపారులు దుకాణాలను మూసివేశారు.
శ్రీకాకుళంలోని వైఎస్‌ఆర్ కూడలిలోని వైఎస్ విగ్రహం వద్ద వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు బంద్‌కు పిలుపునివ్వడంతో వ్యాపారులు షాపులు మూసివేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని విమర్శించారు. పాలకొండలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం వద్ద సమైక్యవాదులు జాతీయ రహదారిని రెండు గంటలపాటు దిగ్బంధించారు. శ్రీకాకుళంలో గురువారం రాత్రి వైఎస్‌ఆర్‌సీపీ నాయకత్వాన పలువురు నాయకులు వైఎస్‌ఆర్ కూడలిలో యూపీఏ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మూడు రోజుల పాటు ప్రజలు బంద్ పాటించాలని కోరారు. ఇచ్చాపురంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతృత్వంలో బస్టాండ్ సెంటర్ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు నిరసన తెలిపారు. పలాసలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో దీక్ష శిబిరం వద్ద టీ నోట్‌ను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ హనుమంతు సాయిరామ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో టీవీలు బద్దలు కొట్టి, టైర్లు కాల్చి నిరసన తెలిపారు. రెండురోజుల బంద్ పాటించాల్సిందిగా జేఏసీ నేతలు పిలుపు నిచ్చారు. నరసన్నపేటలో జాతీయ రహదారిపై జేఏసీ నేతలు బైఠాయించారు.
టీ-నోట్ ఆమోదంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం
Published Fri, Oct 4 2013 2:46 AM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM
Advertisement
Advertisement