నగరవాసుల ట్రాఫిక్ కష్టాలకు సెన్సర్ విధానం ద్వారా చెక్ పెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఐఐటీఎంఎస్ విధానంలో సిగ్నల్స్
68 జంక్షన్లలో ‘బెల్’ సర్వే 4 25 ప్రాంతాల్లో ఏర్పాటుకు నిర్ణయం
సిగ్నల్స్‌తో సీసీ కెమెరాల అనుసంధానం 4 ప్రభుత్వానికి ప్రతిపాదనలు
నగరవాసుల ట్రాఫిక్ కష్టాలకు సెన్సర్ విధానం ద్వారా చెక్ పెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మెట్రో నగరాల్లో అమలులో ఉన్న ఈ విధానాన్ని విజయవాడలోనూ అందుబాటులోకి తేనున్నారు. కృష్ణా పుష్కరాల నాటికి ఇది అందుబాటులోకి రానుంది.
విజయవాడ సిటీ : రాజధాని నగరంలో ట్రాఫిక్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పొరుగు ప్రాంతాలకు చెందిన వాహనాల రాకపోకలు కూడా గతం కంటే 50 శాతం మేర పెరిగాయి. ఇక్కడున్న ట్రాఫిక్‌కు తోడు బయటి ప్రాంతాల నుంచి రాకపోకలు ఎక్కువయ్యాయి. దీంతో గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఒక జంక్షన్ నుంచి మరో జంక్షన్‌కు వెళ్లాలంటే అరగంట పైనే పడుతోంది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు ఇప్పుడు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఐటీఎంఎస్ (ఇంటెలిజెంట్ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టం) విధానంలో సెన్సర్ పద్ధతిలో సిగ్నల్స్ పనిచేసేలా సమగ్ర ట్రాఫిక్ వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఇప్పటికే మెట్రో నగరాల్లో అమలులో ఉన్న ఈ విధానాన్ని అమలు చేసేందుకు హైదరాబాద్‌లో పనులు ప్రారంభమయ్యాయి. అక్కడ రూ.75 కోట్ల వ్యయంతో 200 సిగ్నల్ జంక్షన్లను ఆధునీకరించనున్నారు. విజయవాడలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) అధికారులు సర్వే జరిపి 68 జంక్షన్లలో ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఆవశ్యకతను గుర్తించారు. వాటిలో ముఖ్యమైన 25 ప్రాంతాల్లోని సిగ్నల్స్‌లోనే సీసీ కెమెరాలను అనుసంధానం చేయనున్నారు. బెల్ అధికారుల సర్వే ఆధారంగా పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ ఆమోదం వచ్చిన వెంటనే సెన్సర్ విధానంలో సిగ్నల్ వ్యవస్థను రూపొందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
సీఎం సుముఖం
ఇక్కడ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సుముఖంగా ఉన్నారు. రాజధాని కావడంతో మంత్రులు, వారి శాఖల కార్యాలయాలు ఇక్కడికి తరలి రానున్నాయి. అదే జరిగితే ప్రస్తుత విధానంలో మరిన్ని ట్రాఫిక్ కష్టాలు తప్పవు.
దీనిని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవలని ఇప్పటికే పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి కూడా దీనిపై సుముఖంగా ఉండటంతో త్వరలోనే ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెపుతున్నారు. వచ్చే పుష్కరాల నాటికి ఈ విధానం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వారు పేర్కొంటున్నారు.