సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం లభించిన నేపథ్యంలో.. పోలీసుశాఖ ప్రధాన కార్యాలయాలు ఎక్కడెక్కడ ఏర్పాటుచేయాలనేది చర్చనీయాంశంగా మారింది. కొత్త రాష్ట్రాల ఏర్పాటులో సచివాలయం తరువాత పోలీసు ప్రధాన కార్యాలయమే కీలకం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తరువాత మాత్రమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో వేర్వేరుగా పోలీసు శాఖలు ఏర్పాటయ్యే అవకాశముంది. అప్పటివరకూ ప్రస్తుతం ఉన్న విధానంలోనే కొనసాగనుంది. అయితే.. అధికారిక ఉత్తర్వులకు ముందుగానే పోలీసు శాఖలో అందుకు సంబంధించిన పరిశీలన అనధికారికంగా సాగుతోంది. హైదరాబాద్ పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకూ రాజధానిగా ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో.. ఇరు రాష్ట్రాల డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) కార్యాలయాలను ఇక్కడే కొనసాగించే అవకాశముంది. కానీ, వాటిని వేర్వేరు చోట్ల ఏర్పాటు చేయాల్సి వస్తుంది.
ఈ మేరకు ప్రస్తుతం పోలీసు ప్రధాన కార్యాలయం కొనసాగుతున్న భవనాలు తెలంగాణ రాష్ట్ర డీజీపీకే కేటాయించే అవకాశం ఉంది. లక్డీకాపూల్‌లో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఇంటెలిజెన్స్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయంగా కేటాయించే అవకాశాలున్నాయి. అదే ప్రాంగణంలో ఎస్‌ఐబీ కోసం కొత్త భవనాల నిర్మాణం కూడా మొదలైంది. దీంతో అక్కడ డీజీపీ కార్యాలయం ఏర్పాటు సులభమవుతుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దాంతోపాటు ఇంటెలిజెన్స్ కార్యాలయం పక్కనే నూతనంగా నిర్మించిన రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ) కార్యాలయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయంగా పరిశీలించే అవకాశాలున్నాయి. ఆ భవనం పక్కనే ఉన్న హైదరాబాద్ రీజియన్ ఐజీ కార్యాలయాన్ని కూడా వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది.
ఐపీఎస్‌ల కేటాయింపు..
రెండు రాష్ట్రాల పోలీసు శాఖలకు ఐపీఎస్‌ల కేటాయింపు ఎలా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో 180 మంది డెరైక్ట్ ఐపీఎస్‌లు, 30 మంది పదోన్నతి పొందిన ఐపీఎస్‌లు ఉన్నారు. మొత్తంగా కేంద్రం కేటాయించిన 258 పోస్టుల్లో వంద నుంచి 120 వరకూ తెలంగాణకు కేటాయించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. ఐపీఎస్‌లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లకు ఏ ప్రాతిపదికన కేటాయిస్తారనే అంశంపై చర్చ సాగుతోంది. ఐపీఎస్‌కు ఎంపికైన సమయంలో వారు ఇచ్చిన స్థానికతకు అనుగుణంగా మొదట వేరుచేయనున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతంలో పుట్టినవారిని తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌లో పుట్టినవారిని ఆ రాష్ట్రానికి కేటాయిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్‌లను రెండింటిలో ఏ రాష్ట్రానికి వెళతారనే అభిప్రాయం కోరే అవకాశం ఉంది. ఏదో ఒక రాష్ట్రం వైపే ఎక్కువమంది మొగ్గుచూపితే.. రోస్టర్ పద్ధతిలో వారిని కేంద్ర హోంశాఖే కేటాయిస్తుంది. ఈ రెండింటిలో ఏ విధానాన్ని అనుసరిస్తారనేదానిని అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర హోంశాఖ నిర్ణయిస్తుందని సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ప్రస్తుతం ఎక్కువ మంది సీనియర్ ఐపీఎస్‌లు హైదరాబాద్‌లో ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు.
తెలంగాణకు 120 మంది ఐపీఎస్‌లు..
తెలంగాణ రాష్ట్రానికి వంద నుంచి 120 మంది వరకూ ఐపీఎస్‌లు అవసరమవుతారని అధికారుల అంచనా. ఐపీఎస్ నియామకం సమయంలో ఇచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణ ప్రాంతానికి చెందిన డెరైక్ట్ ఐపీఎస్‌లు పదిమందిలోపే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్, విశాఖపట్నం సీపీ బి.శివధర్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి(డీఐజీ) ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ప్రకాశ్‌రెడ్డి, నవీన్‌కుమార్ తదితరులున్నారు. వీరితో పాటు.. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన ఇతర ప్రాంతాలకు చెందిన వారిలో సీఆర్పీఎఫ్ స్పెషల్ డెరైక్టర్ జనరల్ అరుణా బహుగుణ, తేజ్‌దీప్‌కౌర్ మీనన్, అవినాష్ మహంతి ఉన్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి ఐపీఎస్‌కు ఎంపికైన వారిని కూడా తెలంగాణ ప్రాంతం వారిగానే పరిగణిస్తారు.
పోలీస్ బాస్ ఆఫీసెక్కడ?
Published Mon, Aug 5 2013 2:18 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement
Advertisement