
అదనపు వాహనం ఉంటే వడ్డింపే
నంద్యాలటౌన్: ఆధార్‌కార్డు ఆధారంతో వాహనాల యజమానులపై అదనపు పన్ను వడ్డించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వాహనదారుల నుంచచి ఆధార్‌కార్డులను సేకరించి ఆన్‌లైన్‌తో అనుసంధానం చేసేందుకు నంద్యాల పట్టణాన్ని రాష్ట్రస్థాయిలో పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. అయితే ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రం రావడంతో మెప్మా ఎండీ అనిత రాజేంద్రన్, రవాణా శాఖ అధికారులు మంగళవారం పరిస్థితిని సమీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి శాఖలోని కార్యకలాపాలను ఆధార్‌కు అనుసంధానం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాహనాల యజమానుల నుంచి అదనపు పన్నును వసూలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఒక వ్యక్తి ఒకే వాహనాన్ని కలిగి ఉండాలి. అదనంగా మరో బైక్, కారు, ఇతర వాహనాలు ఉంటే పన్నులను అదనంగా చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వాహనాల యజమానులకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు లేవు.
దీంతో ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు వివరాలను అనుసంధానం చేయాలని నిర్ణయించింది. వాహన దారుడు రాష్ట్రంలో ఎక్కడైనా మరో వాహనాన్ని కొంటే ఆధార్ నంబర్ ఆధారంగా మొదటి వాహనం, అతని ఆర్థిక పరిస్థితి ఇతర వివరాలు నిమిషాల్లో అందుబాటులోకి వస్తాయి. అదనంగా ఉన్న వాహనంపై అధిక పన్నును వసూలు చేయడానికి ఏర్పాట్లు చేశారు.
స్పందన అంతంత మాత్రం...
రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల వివరాలను ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను అనుసంధానం చేసే విధానాన్ని నంద్యాల నుంచి శ్రీకారం చుట్టారు. నంద్యాలను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, మెప్మా, రవాణా శాఖ ఈనెల 10వ తేదీ నుంచి ఇంటింటి సర్వేను ప్రారంభించింది. పట్టణంలోని 84 మంది సీఆర్పీలు, రవాణా శాఖ సిబ్బంది ఇంటింటి సర్వేను ప్రారంభించారు.
వాహనాల యజమానుల ఆధార్ వివరాలను అందజేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, వాహనం చోరీకి గురైనప్పుడు క్షణాల్లో సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ సమాచారం అందుతుందని, భద్రత ఉంటుందని నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఆధార్ కార్డు ఇవ్వడంతో ఇటీవల దాదాపు 1000కి పైగా పింఛన్లు రద్దయ్యాయి. దీంతో ఆధార్ కార్డు ఇవ్వడానికి స్థానికులు ఆసక్తి చూపలేదు.
వారం రోజుల్లో 50వేలకు పైగా వాహనాల యజమానుల ఆధార్ కార్డు వివరాలను సేకరించాలని నిర్ణయించగా కేవలం 6025 మంది వాహన దారుల వివరాలు మాత్రమే అందాయి. దీంతో ప్రజల నుంచి కనీసం 15 శాతం కూడాస్పందన రాకపోవడంతో అధికారులు మరో వారం రోజులు గడువు పొడిగించారు.
అందరూ ఆధార్ ఇవ్వాలి
ఆధార్‌కార్డుల అనుసంధానం గురించి మెప్మా మేనేజింగ్ డెరైక్డర్ అనితారాజేంద్రన్ సిబ్బందితో మున్సిపల్ కమిషనర్ చాంబర్‌లో సమావేశమయ్యారు. ఆధార్‌కార్డుల సేకరణలో ఎదురైన సమస్యల గురించి సీఆర్పీలను అడిగి తెలుసుకున్నారు. వాహన దారుల యజమానులు, వారి కుటుంబ సభ్యులు వివరాలను ఇవ్వడానికి వెనుకాడుతున్నారని సీఆర్పీలు చెప్పారు.
అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రతి వాహన యజమాని తప్పని సరిగా ఆధార్ వివరాలను అందజేయాలని కోరారు. ఇంటింటికి సీఆర్పీలు వచ్చినప్పుడు ఆధార్ వివరాలను అందజేయవచ్చని, లేకపోతే మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, వెబ్‌సైట్‌లో కూడా వివరాలను అందజేయవచ్చని చెప్పారు. ఆధార్ కార్డు ఇవ్వడం వలన వాహనం చోరీకి గురైతే సరైన సమాచారం అందుతుందని చెప్పారు.
సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన, కమిషనర్ రామచంద్రారెడ్డి, ఐవీ స్పెషలిస్ట్ ఆదినారాయణ, డీసీఓ శివలింగమయ్య, ఆర్‌టీఓ రాజబాబు, టౌన్ ప్రాజెక్టు అధికారి సతీష్, సీఆర్పీలు, రవాణా శాఖ అధికారులు హాజరయ్యారు.