తనకు తెలియకుండా ఫొటోలు తీసి, వాటిని ఇస్తానని రమ్మని చెప్పి డక్కా ప్రశాంత్ అనే యువకుడు లైంగికదాడి జరిపాడని మండలంలోని రేబాల ప్రగతి నగర్ కాలనీకి చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నెల్లూరు రూరల్ డీఎస్పీ విచారణ
బుచ్చిరెడ్డిపాళెం : తనకు తెలియకుండా ఫొటోలు తీసి, వాటిని ఇస్తానని రమ్మని చెప్పి డక్కా ప్రశాంత్ అనే యువకుడు లైంగికదాడి జరిపాడని మండలంలోని రేబాల ప్రగతి నగర్ కాలనీకి చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై నిర్భయ చట్టం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసినట్టు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై కథనం మేరకు.. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఫొటోను అదే కాలనీకి చెందిన డక్కా ప్రశాంత్ తీశాడు.
అనంతరం ప్రశాంత్ స్నేహితుడు పూర్ణచంద్రరావు కూడా ఫొటోలు తీశాడు. అయితే తన ఫొటోలు ఇవ్వమని బాలిక కోరగా రాత్రి సమయంలో ఒంటరిగా రావాలని చెప్పాడు. దీంతో అక్కడికి వెళ్లగా ప్రశాంత్ లైంగికదాడి జరిపినట్లు బాధితురాలు పేర్కొంది. ఈ విషయమై అడిగేందుకు వెళ్లగా షేక్ రియాజ్, గయాజ్, ఫయాజ్ అనే వ్యక్తులు కులం పేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొందనిఎస్సై తెలిపారు.
డీఎస్పీ విచారణ : లైంగిక దాడి, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుపై నెల్లూరు రూరల్ డీఎస్పీ వీఎస్ రాంబాబు గురువారం విచారణ జరిపారు. బాధితురాలి నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని, విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.