ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు.
మంచాల: ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేయలేదని ఆగ్రహించిన తోటి విద్యార్థులు, స్థానికులు శనివారం మంచాల పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. పలు పార్టీల నాయకులు వారికి మద్దతు పలికారు. వివరాలు.. మండల పరిధిలోని ఆరుట్ల గ్రామానికి చెందిన జోగు శేఖర్(25) స్థానికంగా కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
అదే గ్రామానికి చెందిన విద్యార్థిని(15) స్థానికంగా ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి ఏడాది చదువుతోంది. ఇదిలా ఉండగా, గత డిసెంబర్ 31న రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో బాలిక తన ఇంట్లో ఒంటరిగా ఉంది. శేఖర్ ఆమె ఇంట్లోకి చొరబడి విద్యార్థినిపై అత్యాచారయత్నం చే శాడు. బాలిక ప్రతిఘటించడంతో యువకుడు ఆమెను చితకబాదాడు. అంతలోనే విద్యార్థిని కుటుంబీకులు రావడంతో యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి బంధువులు శుక్రవారం రాత్రి మంచాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా..
బాలికపై అత్యాచారయత్నం చేసిన యువకుడిని వెంటనే అరెస్టు చేయాలని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆరుట్ల ఆదర్శ పాఠశాలలో చదువుకునే బాధితురాలి తోటి విద్యార్థులు శనివారం మంచాల పోలీస్‌స్టేషన్ ఎదుట రహదారిపై ధర్నాకు దిగారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు నిర్లక్ష్య వైఖరి వీడాలని మండిపడ్డారు. విద్యార్థులకు, పలు పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు మద్దతు పలికాయి.
సీఐ గంగాధర్ వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొద్దిసేపటి తర్వాత సీఐ గంగాధర్ అక్కడికి వచ్చి ఆందోళనకారులకు సర్దిచెప్పారు. నిందితుడిపై ఐపీసీ 447, 324, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, వెంటనే అతడిని పట్టుకొని రిమాండుకు తరలిస్తామని సర్దిచెప్పారు.
దీంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో ఆరుట్ల సర్పంచ్ యాదయ్య, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ సలాం, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గజ్జి ఐలయ్య, నాయకులు జానీ పాషా, రఘుపతి, రవి, జంగయ్య, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. పాల్గొన్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి: ఎంపీపీ జయమ్మ
ఎంపీపీ జయమ్మ ఆరుట్లలో బాధితురాలిని పరామర్శించి వివరాలు సేకరించారు. పోలీసులు నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.