
పెందుర్తి: ఇటీవల కేరళ రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా దెబ్బతిన్న గిరిజన ప్రాంతాల్లో సహాయ సహకారాలు అందించేందుకు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సంకల్పించారని, ఆయన ఆదేశాల మేరకు అనేక మంది దాతలను సహాయసహకారాల కోసం సంప్రదించినట్టు ఆ పీఠం ట్రస్ట్ రొబ్బి శ్రీనివాస్ తెలిపారు. ఐపీపీ సెంచరీ క్లబ్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి విలయతాండవంతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలుసుకుని రుషికేష్‌లో చాతుర్మాసదీక్షలో ఉన్న స్వరూపానందేంద్ర సరస్వతి అక్కడి ప్రజలకు దుస్తులు, పప్పుదినుసులు తదితర వాటిని అందించాలని శ్రీశారదాపీఠం ట్రస్ట్ సభ్యులను ఆదేశించారన్నారు.
కేరళలో కూడా శంకర సేన సేవా ట్రస్ట్ శారదాపీఠానికి అనుబంధంగా ఉందని పేర్కొన్నారు. సేవలందించేవారు శారదాపీఠానికి తెలియజేస్తే శంకర సేన సేవా ట్రస్ట్, శారదాపీఠం ట్రస్ట్ సభ్యులు, శారదాపీఠం భక్తులు అంతా కలిసి కేరళ ప్రాంతంలో వాటిని అందజేస్తారని చెప్పారు. ఇప్పటికే తొలివిడతగా శంకరసేన సేవా ట్రస్టుకు 5వేల దుప్పట్లు, 2వేల చీరలు, 1500 పంచెలు, 3వేల టవల్స్, ఆహారపదార్థాలు పంపించామని తెలిపారు. రెండో విడతగా ఆదివారం సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎంఆర్ షాపింగ్‌మాల్ అధినేత మావూరి వెంకటరమణ, కృతుంగా రెస్టారెంట్స్ ఎండి నరేందర్‌రెడ్డి, అభిరుచి స్వీట్స్ అధినేత రామకృష్ణ, హూలీమేరీ ఇంజినీరింగ్ కళాశాల అధినేత డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, మహిణ ఇన్‌ఫ్రా అధినేత సతీష్‌బాబు విరాళాలు ప్రకటించారు. శ్రీదుర్గా ఐబీపీ సెంచరీ క్లబ్ తరఫున లక్ష రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళం అందించారన్నారు. శారదాపీఠం ట్రస్టీలు చల్లా రామారావు, సభ్యులు కె.చలపతిరావు, పి.హనుమంతరావు, పి.మల్లికార్జునరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment