11న షర్మిల సమైక్య శంఖారావం
Published Sun, Sep 8 2013 1:52 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు: ఉద్యమాల పురిటిగడ్డ గుంటూరు జిల్లాలో మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 11న సమైక్య శంఖం పూరించనున్నారు. ప్రజాభీష్టానికి పెద్ద పీట వేస్తూ, కాంగ్రెస్, టీడీపీ చీకటి ఒప్పందాలను బహిర్గతం చేస్తూ సమైక్యాంధ్ర కోసం బస్సుయాత్ర చేపట్టిన షర్మిల వినుకొండ, రేపల్లె బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. కేవలం ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ ఏకపక్షంగా తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఎండగడుతూ షర్మిల జిల్లాలో యాత్ర చేయనున్నారు.
అధికారం కోసం ఏకమైన కాంగ్రెస్, టీడీపీల కుట్రలను ప్రజలకు వివరిస్తూ షర్మిల చేస్తున్న యాత్రకు గుంటూరు జిల్లాలోని సమైక్యవాదులు సంఘీభావం ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజా కంటక పాలనను నిరసిస్తూ షర్మిల ఫిబ్రవరిలో జిల్లాలో 33 రోజులు పాదయాత్ర నిర్వహించారు. ఇప్పుడు ప్రజాభిప్రాయానికి పట్టం కడుతూ సమైక్యాంధ్ర కోసం శంఖారావం పూరిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం కేంద్ర హోం మంత్రి షిండేకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
Advertisement