బెల్టుషాపుల రద్దు ప్రహసనమేనా! | Shop liquor license revoked | Sakshi
Sakshi News home page

బెల్టుషాపుల రద్దు ప్రహసనమేనా!

Published Sun, Jun 22 2014 2:27 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

బెల్టుషాపుల రద్దు ప్రహసనమేనా! - Sakshi

బెల్టుషాపుల రద్దు ప్రహసనమేనా!

  • మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారుల కుమ్మక్కు
  •  పట్టుకుంటే పది నిమిషాల్లో బయటికి
  •  టీడీపీ నేతల సిఫార్సులు
  •  బెల్టుషాపుల రద్దుకు ఆరంభంలోనే హంసపాదు
  • జిల్లాలో బెల్టుషాపుల మూసివేత ప్రహసనంగా మారింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజునే బెల్టుషాపులు మూసివేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంబంధిత ఫైలుపై నాలుగో సంతకం పెట్టారు. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్వయంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జిల్లాలోనే బెల్టుషాపులు మూసినట్లే మూసి తెరవెనుక వ్యాపారం నడుపుతుండటం గమనార్హం.          
     
    మచిలీపట్నం : జిల్లాలో 335 వైన్‌షాపులు ఉండగా వాటిలో 45 మద్యం దుకాణాలకు టెండర్లు దక్కించుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మిగిలిన 290 మద్యం షాపుల పరిధిలో బెల్టుషాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఒక్కొక్క మద్యం షాపు పరిధిలో కనీసంగా పది కన్నా ఎక్కువగా బెల్టుషాపులు నడుపుతున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 1200కు పైగా బెల్టుషాపులు ఉన్నట్లు చెబుతున్నారు.

    మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ శాఖ అధికారుల కనుసన్నల్లో ఇంతకాలంగా బెల్టుషాపుల్లో మద్యం వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లింది. నూతన ప్రభుత్వం బెల్టుషాపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవటంతో మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
     
    మద్యం వ్యాపారుల భరోసా...
     
    బెల్టుషాపులు తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో నిర్వాహకులు కొంత వెనుకంజ వేశారు. మద్యం వ్యాపారులు మాత్రం.. మీకొచ్చిన ఇబ్బందేమీ లేదు, మా మద్యం దుకాణం పరిధిలో బెల్టుషాపు నడిపినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోరంటూ భరోసా ఇస్తున్నారు. మద్యం షాపు నుంచి బెల్టుషాపు వరకు మద్యాన్ని తీసుకువెళ్లినా ఎవరూ పట్టుకోరని, ఎక్సైజ్ అధికారులకు తాము సర్దిచెప్పుకొంటామని వారు మీ వైపు చూడరని నచ్చజెబుతున్నారు.

    కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాంటి హడావుడి మామూలేనని, ఎవరూ భయపడవద్దంటూ ధైర్యవచనాలు చెబుతున్నారు. బెల్టుషాపులకు మద్యాన్ని తరలించటంలోనూ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. బెల్టుషాపు నిర్వాహకుల్లో చురుకుగా ఉండే వ్యక్తి వద్దకు మద్యం సీసాలను పంపుతున్నారు. అక్కడి నుంచి చుట్టుపక్కల ఉన్న బెల్టుషాపులకు తరలిస్తున్నారు.
     
    టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే...
     
    ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గంలోని ఓ బెల్టుషాపు నిర్వాహకుడిని ఎక్సైజ్ ఎస్సై శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఇక నుంచి బెల్టుషాపు నిర్వహించబోనని, మొదటి తప్పుగా భావించి వదిలేయాలని సంబంధిత వ్యక్తి ఎస్సైని బతిమాలుకున్నా ఫలితం లేకపోయింది. బెల్టుషాపు నిర్వాహకుడిని ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఇక్కడే కథ మారింది.

    మంత్రి ముఖ్య అనుచరుడు.. జిల్లాస్థాయి పదవిలో కొనసాగిన ఓ నాయకుడు ఎక్సైజ్ పోలీసులకు ఫోన్ చేసి మావాడే వదిలేయాలని సిఫార్సు చేయటంతో బెల్టుషాపు నిర్వాహకుడిని క్షణాల్లో వదిలేశారు. ఈ అంశం ఎక్సైజ్ అధికారులతో పాటు పట్టణంలోనూ చర్చనీయాంశమైంది. తెలుగుదేశం ప్రభుత్వమే బెల్టుషాపులను రద్దు చేస్తామని ప్రకటించగా, అమలులో ఆ పార్టీ నాయకులే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంపై జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
     
    రెండు నెలల హడావుడేనా?

     
    బెల్టుషాపుల రద్దుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసినా.. మద్యం వ్యాపారులు, సిండికేట్ నేతలు మాత్రం ధీమాగానే ఉన్నారు.  ఓ రెండు నెలల పాటు ఈ హడావుడి ఉంటుందని, తరువాత అన్నీ సర్దుకుంటాయని చెబుతున్నారు. వ్యూహం మార్చి బెల్టుషాపుల్లో గుట్టుచప్పుడు కాకుండా మద్యం విక్రయాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏదో ప్రకటన చేస్తుంది.. అవన్నీ పాటించాలా, మాకుండే మార్గాలు మాకున్నాయని చెబుతుండటం కొసమెరుపు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement