సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆపరేషన్లు, ఎలుకల దాడిలో పసికందు మృతి వంటి ఘటనలతో పాతాళానికి పడిపోతున్న జీజీహెచ్ ప్రతిష్టను.. కొందరు వైద్యులు ఉచిత ఆపరేషన్లతో ఆకాశానికి తీసుకెళుతున్నారు. ఇది ఆసరాగా పేద రోగుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు నిలువెల్లా నిర్లక్ష్యంతో చీకటిమయం చేస్తున్నారు. థియేటర్లలో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఆపరేషన్లకు పంగనామాలు పెడుతున్నారు. ప్రభుత్వ పాలకులు గుండె మార్పిడి ఆపరేషన్లకు ప్యాకేజీ తేల్చకుండా పేదల ఊపిరి తీస్తున్నారు. ఇంప్లాంట్‌లు ఇవ్వకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ల కీలు విరగ్గొడుతున్నారు. మూత్రపిండాల మార్పిడి ఆపరేషన్లకు థియేటర్ సమస్య పరిష్కరించకుండా ఐసీయూలో పడేస్తున్నారు. మొత్తంగా జీజీహెచ్‌లో రోగుల వేదనలు, రోదనలను గాలికొదిలేస్తున్నారు.
సాక్షి, గుంటూరు: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా జీజీహెచ్ పరిస్థితి తయారైంది. పెద్దాస్పత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు అనేక మంది ప్రముఖ వైద్యులు ముందుకు వస్తున్నారు. గతంలో కనీసం చిన్న గుండె ఆపరేషనే జరగని ఆస్పత్రిలో ఏకంగా గుండె మార్పిడి, కిడ్నీ మార్పిడి, కీళ్ల మార్పిడి ఆపరేషన్లు సైతం నిర్వహించారు. పెద్దాస్పత్రి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. కానీ ప్రభుత్వం, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం రోగులపాలిట శాపంగా మారింది. జీజీహెచ్‌లో కీళ్ల మార్పిడి, కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌లకు బ్రేక్‌లు పడ్డాయి. ఎంఆర్‌ఐ స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేసి ఆరు నెలలు దాటుతున్నా ఇంత వరకూ ప్రారంభించకపోవడంతో యూరాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, రేడియాలజీ వంటి సూపర్‌స్పెషాలిటీ కోర్సులు చదువుతున్న వైద్య విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
స్పందించే హృదయం లేదా ?
గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో అతి తక్కువ ఖర్చుతో చదువుకుని దేశ, విదేశాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగిన ఎందరో వైద్యులు.. పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే తలంపుతో జీజీహెచ్‌లో ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. పీపీపీ విధానం ద్వారా ఇప్పటికే జీజీహెచ్ మిలీనియం బ్లాక్‌లో సహృదయ ట్రస్టు ద్వారా డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే వైద్య బృందం 450కుపైగా గుండె ఆపరేషన్లు చేసింది.
దీనికి దాతల సహాయం, సొంత డబ్బులు వెచ్చింది. గుండె మార్పిడి ఆపరేషన్‌లను నిరుపేద రోగులకు ఉచితంగా చేసేందుకు డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్యసేవలో చేర్చాలంటూ డాక్టర్ గోఖలే ఉన్నతాధికారులను కోరారు. దీనికి సుముఖత వ్యక్తం చేసినా ప్రభుత్వం ఏడాదిన్నరగా ప్యాకేజీ నిర్ణయించ లేదు. దీంతో గుండె మార్పిడి ఆపరేషన్లు నిలిచిపోయాయి. గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం వందల మంది రోగులు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు.
ఆపరేషన్ థియేటర్‌ల సమస్య
జీజీహెచ్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో రూ. 3 కోట్లతో 2014లో నాలుగు అత్యాధునిక మాడ్యూలర్ ఆపరేషన్ థియేటర్లను నిర్మించారు. వీటిలో కార్డియాలజీ విభాగానికి రెండు కేటాయించారు. ఒకటి న్యూరోసర్జరీకి అప్పగించారు. మిగిలిన ఒక్క ఆపరేషన్ థియేటర్‌లో గతంలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిర్వహించారు. కీళ్ల మార్పిడి ఆపరేషన్లకు థియేటర్ లేకపోవడంతో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు కేటాయించిన థియేటర్‌ను వినియోగిస్తున్నారు. ఇలా చేయడంతో ఇన్‌ఫెక్షన్లు వస్తున్నాయని కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిలిపివేశారు. దీంతో కిడ్నీ, కీళ్ల మార్పిడి అపరేషన్ల నిర్వహణకు తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ ఆపరేషన్లకు లక్షలు ధారపోయాల్సి ఉండడంతో పేదలు జీజీహెచ్ మీదే ఆశలు పెట్టుకున్నారు. ప్లాస్టిక్ సర్జరీ విభాగంలోని ఎస్‌వోటీలో ఆపరేషన్ నిర్వహించే సమయంలో ఓటీ లైట్‌లు ఆరిపోవడంతో సెల్‌ఫోన్ వెలుగులో నిర్వహించారు. ఇది ఆస్పత్రికి మాయనిమచ్చగా మిగిలిపోయింది.
దాతలు ముందుకొచ్చినా..
జీజీహెచ్‌లో కీళ్ల మార్పిడి ఆపరేషన్లతోపాటు ఇంప్లాంట్‌లను ఉచితంగా అందించి నిరుపేదలకు సేవ చేసేందుకు సాయిభాస్కర్ ఆసుపత్రి అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ముందుకు వచ్చారు. కానీ ఆపరేషన్ థియేటర్ల కొరత, ప్రభుత్వం ఇంప్లాంట్ల కోసం నిధులు విడుదల చేయకపోవడంతో కీళ్లమార్పిడి ఆపరేషన్లు నిలిచిపోతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 200 మంది కీళ్లమార్పిడి ఆపరేషన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. వీరి ఆర్తనాదాలు ప్రభుత్వానికిగానీ, ఉన్నతాధికారులకుగానీ వినిపించడం లేదు.
ఆపరేషన్ థియేటర్‌లకు నిధులు మంజూరయ్యాయి
ఎన్‌ఏబీహెచ్ పనుల్లో భాగంగా గుంటూరు జీజీహెచ్‌లో ఆపరేషన్ థియేటర్లు నూతనంగా నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆరు నెలల్లో నాలుగు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు నిర్మాణం చేసేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ థియేటర్ల నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. టెండర్లు పూర్తికాగానే ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వస్తాయి.
– డాక్టర్ రాజునాయుడు,
జీజీహెచ్ సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment