సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పోలీసు సంస్కరణలన్నింటికీ చట్టబద్ధత కల్పించే విధంగా రాష్ట్రంలో కొత్త పోలీసు చట్టానికి రూపకల్పన జరుగుతోంది. ఈ మేరకు పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. డీజీపీ వి. దినేష్‌రెడ్డి, పోలీసు ఆపరేషన్స్ విభాగం డెరైక్టర్ జనరల్ జేవీ రాముడు, ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ వీఎస్‌కే కౌముది, పోలీసు కోఆర్డినేషన్ విభాగం అదనపు డీజీ వీకే సింగ్, పోలీసు పరిపాలన విభాగం అదనపు డీజీ ఆనురాధ, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎం.మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
పోలీసు సంస్కరణలకు అనుగుణంగా కొత్త పోలీసు చట్టాన్ని రూపొందించుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న మూడు పోలీసు చట్టాలు.. ఆంధ్రప్రదేశ్ పోలీసు చట్టం, తెలంగాణ పోలీసు చట్టం, హైదరాబాద్ పోలీసు చట్టం స్థానంలో ఒకే పోలీసు చట్టాన్ని రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లు తయారుచేసేందుకు న్యాయ నిపుణుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు.
సుప్రీం ఆదేశాల మేరకు..: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర హోంశాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసిన సంస్కరణలన్నింటికీ పోలీసు చట్టంలో స్థానం కల్పించనున్నారు. డీజీపీతోపాటు జిల్లా ఎస్పీ, శాంతిభద్రతల విభాగంలో పనిచేసే అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో)లకు ఖచ్చితంగా రెండేళ్ల పదవీకాలం ఉండేలా చట్టం రూపొందించనున్నారు. వారిపై తీవ్రమైన ఆరోపణలు, పనితీరులో అసమర్ధత నేపథ్యంలో మాత్రమే రెండేళ్లకన్నా ముందుగా వారిని బదిలీచేసే అవకాశం ఉంటుంది. హైకోర్టు/సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి చైర్మన్‌గా పోలీసు ఫిర్యాదుల విభాగం (పీసీఏ)ను కూడా చట్టబద్ధం చేయనున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై పీసీఏ విచారణ జరుపుతుంది. రాష్ట్ర భద్రతా కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఏర్పాటుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూతన చట్టం ముసాయిదా బిల్లు తయారైన అనంతరం శాసనసభ ఆమోదానికి పంపుతారు.