
ఏజెన్సీలో గిరిజన పార్టీయే ఉండాలి
గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ పార్టీయే ఉండాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. గిరిజనులు పార్టీల వారీగా చీలిపోయూరని....
విశాఖపట్నం : గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ పార్టీయే ఉండాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. గిరిజనులు పార్టీల వారీగా చీలిపోయూరని, ఐక్యంగా ఉంటే ప్రభుత్వాలే దారికొస్తాయని గిరిజనులకు సూచించారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం కోరుతూ జి.మాడుగుల, చింతపల్లి, కొయ్యూ రు, గూడెం కొత్తవీధి, పాడేరు, అనంతగిరి ప్రాంతాల నుంచి గిరిజనులు గురువారం విశాఖకు తరలివచ్చారు.
రైల్వే స్టేషన్ నుంచి సౌత్ జైల్‌రోడ్డు మీదుగా జీవీఎంసీ గాంధీ పార్కు వరకు ప్రదర్శనగా వచ్చి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీక్షనుద్దేశించి శర్మ మాట్లాడుతూ శాంతియుతంగా చేసే ఏ ఉద్యమానికైనా బలం చేకూరుతుందని, ప్రతి వారు గాంధీ మార్గంలో నడవాలని గిరిజనులకు సూచించారు. అడవుల విషయంలో ఆదివాసీలకు చారిత్రక అన్యాయం జరుగుతుందని సాక్షాత్తు భారత పార్లమెంట్ అంగీకరించిందన్నారు. అన్యాయూన్ని సరిచేసేందుకు అటవీ హక్కుల చట్టాన్ని 2006లో తెచ్చారని,చట్టం అమలు విశాఖ ఏజెన్సీలో ఘెరంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ కార్యదర్శి జి.బాలు, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ పి.ఎస్.అజయ్‌కుమార్ మాట్లాడుతూ సాంప్రదాయ కుంచాలతో సరుకులు కొనుగోలు చేయడాన్ని ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద నేరంగా ప్రకటించాలని కోరారు. తూనికలు, కొలతల చట్టాన్ని అమలు పరిచే అధికారాలు గ్రామ సభలకు ఇవ్వాలని, వడ్డీ వ్యాపారం చేసేవారు నగదు రూపంలో తప్ప ఆదివాసీలు పండించిన పంటలు తీసుకోవడాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు ఇచ్చిన సాధారణ రేషన్‌కార్డులను అంత్యోదయ అన్న యోజన కార్డులుగా మార్చాలని కోరారు.