అంగరంగ వైభవంగా శిడిబండి ఉత్సవం
ఉయ్యూరు, న్యూస్‌లైన్ : అమ్మా వీరమ్మ.. శరణు శరణు.. కోర్కెలు తీర్చే కల్పవల్లి రక్షమామ్.. రక్షమామ్.. అంటూ భక్తుల శరణుగోష ఉయ్యూరులో ప్రతిధ్వనించింది. వేలాది మంది భక్తులు పసుపుకుంకుమలు సమర్పించి శిడిబండికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో భాగంగా 11వ రోజైన గురువారం నిర్వహించిన శిడిబండి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. 15 రోజులపాటు జరిగే ఉయ్యూరు వీరమ్మతల్లి ఉత్సవాల్లో శిడిబండికి ఓ ప్రత్యేకత ఉంది.
ఈ కారణంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేకంగా రూపొందించిన శిడిబండి శివాలయం రోడ్డు నుంచి వీరమ్మతల్లి ఆలయానికి చేరుకుంది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పసుపు కుంకుమలు, అరటిపళ్లు, హారతులు సమర్పించారు. భక్తుల కోలాహలం మధ్య పోలీసు బలగాలు శిడిబండిని కాలేజీ రోడ్డు నుంచి ప్రధాన సెంట ర్ మీదుగా ఆలయానికి చేర్చాయి. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు పూర్తి చేసిన పిదప శిడి మహోత్సవం ప్రాంగణానికి బండిని చేర్చారు.
పెళ్లికొడుకు బంధువుల నిరసన...
ఈ తరుణంలో శిడిబుట్టలో కూర్చునేందుకు దళితవాడ నుంచి ఉయ్యూరు వంశీకులు ఈ ఏడాది పెళ్లి అయ్యే ఉయ్యూరు వెంకటేశ్వరరావును స్థానికులు, బంధువులు మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. మార్గమధ్యంలో ఓ ఎస్‌ఐ పెళ్లికొడుకు బంధువుపై చేయిచేసుకోవడంతో శిడి ఉత్సవానికి పెళ్లికొడుకు రాడంటూ బంధువులు ఓ బ్యాంక్ కార్యాలయం ప్రాంగణం వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసుల జులుం నశిం చాలి.. పోలీసులు క్షమాపణ చెప్పాలి.. అంటూ నిరసన వ్యక్తం చేశారు.
పట్టణ ఎస్‌ఐగా గతంలో పనిచేసిన శివప్రసాద్ పెళ్లికొడుకు బంధువులతో సంప్రదింపులు జరిపి తనపై నమ్మకం ఉంచి తనవెంట కలిసి రావాలని, ఉత్సవాన్ని సజావుగా సాగేలా సహకరించాలని కోరడంతో బంధువులు ఆందోళన విరమించి శిడి ఉత్సవానికి కదిలారు. అనంతరం ఆలయ ప్రదక్షణ పూర్తి చేసిన తరువాత శిడిబుట్టలో కూర్చున్న యువకుడు వెంకటేశ్వరరావు మరో మారు ఆలయ ప్రదక్షిణ పూర్తి చేసుకున్న అనంతరం మూడు పర్యాయాలు శిడి ఆడించటంతో ఉత్సవం ముగుస్తుంది. శిడిబండికి తగిలిన అరటిపళ్లు దొరికితే పిల్లలు లేని వారికి పిల్లలు, పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందని భక్తుల నమ్మకం. డీసీపీ రవిప్రకాష్, ఏసీపీ మహేశ్వరరాజు, సీఐలు, ఎస్‌ఐలు భద్రతా చర్యలు చేపట్టారు.