
జి.ఎర్రగుడి(తుగ్గలి): రైతు ఆత్మహత్యలకు టీడీపీ విధానాలే కారణమని వైఎస్‌ఆర్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ఆరోపించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా తుగ్గలి మండలం జి.ఎర్రగుడి సమీపంలో ఆదివారం సాయంత్రం నిర్వహించ తలపెట్టిన రైతుసభ ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు విశేష స్పందన వస్తోందన్నారు.
అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలను వైఎస్ జగన్‌తో విన్నవించుకుంటున్నారన్నారు. పర్మినెంట్ చేస్తామని కాంట్రాక్ట్ ఉద్యోగులను, రుణాలు మాఫీ చేస్తానని రైతులను, డ్వాక్రా మహిళలను, ఇంటికో ఉద్యోగం అంటూ నిరుద్యోగులను చంద్రబాబు నాయుడు మోసం చేశారన్నారు. నాలుగేళ్లు గడిచినా ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. 2019 నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తప్పించుకునే ఆలోచనతో కేంద్రంపై నెపాన్ని నెట్టేందుకు చూస్తున్నాడని, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారన్నారు. పట్టిసీమ ఎవరికి ఉపయోగపడింది ఏమైనా నికర జలాలు రాయలసీమకు కేటాయించారా అని ప్రశ్నించారు.
ఎన్ని టీఎంసీలు కేటాయిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై చర్చించేందుకు ఆదివారం సాయంత్రం తలపెట్టిన భారీ రైతు సదస్సుకు 5వేల నుంచి 10 వేల మంది వరకు రైతులు వచ్చే అవకాశం ఉందన్నారు. పాదయాత్రకు, సదస్సుకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. రైతు సదస్సుకు జిల్లా వ్యాప్తంగా రైతులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, గంగుల నాని, ప్రదీప్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ నాగేష్, మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.