రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు తీరని నష్టం
Published Tue, Sep 17 2013 3:42 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందని ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘ నాయకుడు తిప్పారెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ విద్యా సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్‌ఐఓ) కార్యాలయం ఎదుట కొనసాగిస్తున్న రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఐదో రోజు దీక్షను సోమవారం ఇంటర్మీడియట్ విద్య జేఏసీ కన్వీనర్ పీ రంగనాయకులు, విశ్రాంత అధ్యాపకులు కే గణపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిప్పారెడ్డి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన వల్ల నదీ జలాల పంపిణీ విషయంలో సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యా, ఉపాధి రంగాల్లో కూడా అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ఆదాయం, రుణాలు, హైదరాబాద్ లాంటి కీలక అంశాల పరిష్కారం, సీమాంధ్ర ప్రజలకు జరిగే అన్యాయం గురించి వెంకటేశ్వరరెడ్డి వివరించారు. విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ రాయపాటి జగదీష్.. విభజన వల్ల విద్య, ఉపాధి తదితర విషయాల్లో తలెత్తే సమస్యలను వివరించారు. సీమాంధ్ర విద్యార్థులందరూ చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్‌ఐఓ పి.మాణిక్యం దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమైఖ్యంగా ఉంటేనే అన్ని ప్రాంతాల వారికి, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బోధనేతర సిబ్బంది జిల్లా అధ్యక్షుడు యూ కోటేశ్వరరావు సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరించారు.
జిల్లాలోని 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలల బోధనేతర సిబ్బంది ఉద్యమంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. 5వ రోజు దీక్షలో దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జే సువర్ణబాబు, అధ్యాపకులు సీహెచ్ తారావాణి, వీ కోటయ్య, జీ మనోహర్‌రెడ్డి, రామాచారి, ఇతర కళాశాలలకు చెందిన బోధనేతర సిబ్బంది ఎం.మాల్యాద్రి, పీ వెంకటేశ్వర్లు, టీ ప్రవీణ్‌కుమార్, ఐవీ సుజాత, ఫాతిమా మేరి, అద్దంకి తెలుగు అధ్యాపకులు ఆనందబాబు కూర్చున్నారు.
దీక్షా శిబిరాన్ని ప్రిన్సిపాళ్ల సంఘం నాయకులు డీఆర్ కే పరమహంస, ఎస్.సత్యనారాయణ, ఎయిడెడ్ కళాశాల సంఘ నాయకులు పోటు నాగేశ్వరరావు, వెంకటేశ్వరరెడ్డి, జీజేఎల్‌ఏ నాయకులు నారాయణరావు, టీ వెంకటేశ్వరరెడ్డి, పీడీ సంఘ నాయకులు ఎం.హరనాథబాబు, రిటైర్డ్ డిగ్రీ అధ్యాపకులు కంచర్ల సుబ్బారావు, ఎండీ రహమాన్, పీ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాళ్ల సంఘ మాజీ అధ్యక్షుడు పీ నరసింహారెడ్డి, ఎన్జీఓ నాయకులు గోవిందరావు, తిరుమలయ్య, ఆర్‌ఐఓ కార్యాలయం ఏవో ఆంజనేయులు, సిబ్బంది సందర్శించి సంఘీభావం తెలిపారు.
Advertisement
Advertisement