విభజనతో సీమాంధ్రకు తీరని నష్టం | simandhra incurable damage to the partition of the state | Sakshi
Sakshi News home page

విభజనతో సీమాంధ్రకు తీరని నష్టం

Published Mon, Nov 18 2013 3:26 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

simandhra incurable damage to the partition of the state

మంత్రులు అమ్ముడుపోయారు సీమాంధ్రకు చెందిన రాష్ట్ర, కేంద్ర మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వానికి అమ్ముడుపోయారు. వారిని గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి.. జరుగుతున్న అన్యాయాన్ని కళ్లప్పగించి చూస్తుండి పోవడం బాధాకరం. కొంతమంది మంత్రులు అధిష్టానానికి అనుకూలంగా మాత్రమే పనిచేస్తానని చెప్పడం ప్రజలపై వారి చిత్తశుద్ధిని తెలుపుతోంది.
 - ఎల్.సూర్యారావు, నీటిపారుదల శాఖ రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజినీర్
 
 నేల తల్లి గొంతు తడారిపోతుంది
 ఇప్పటివరకూ వ్యవసాయాన్నే నమ్ముకుని బతుకుతున్నాం. మొన్న వచ్చిన తుపానుకు పంటలు మునిగిపోయాయి. ఇలా చాలాసార్లు జరిగినా నేల తల్లిపైనే మా బతుకులు ఆధారపడి ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగితే ఆ తల్లి గొంతు పూర్తిగా తడారిపోతుంది, మా గుండెలాగిపోతాయి. కుటుంబాలు రొడ్డున పడతాయి. మా ఉసురు తప్పక వారికి తగులుతుంది.
 - కోటిపల్లి వెంకట్రావు, అడవికొలను, రైతు
 
 గోదారే దిక్కు
 ఏమీ లేని వాడికి దేవుడే దిక్కన్నట్టు మా ప్రాంతానికి గోదారమ్మే దిక్కు. గోదారి కరుణిస్తేనే మా పంటలు పండుతాయి. మా ఇళ్లు కళకళలాడుతాయి. రాష్ట్రం విడిపోతే మా ప్రాంతానికి సాగునీరు అందదు. దానితో మా పొలాలు ఎండి ఎడారిగా మారిపోతాయి. మా జీవితాలు అథోగతి పాలౌతాయి.
 - ఎరగం సత్యనారాయణ, రైతు, అడవికొలను
 
 కృష్ణానదిని ఎండబెట్టారు
 పాలకుల అసమర్థత కారణంగా ఇప్పటికే కృష్ణానది ఎండిపోయింది. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచకుండా ఆపి ఉంటే కృష్ణా డెల్టాలో రెండు పంటలు పండి రైతులు సంతోషంగా ఉండేవారు. ఇప్పుడు గోదావరి డెల్టా ప్రజల వంతు వచ్చింది. నాయకుల చేతిలో రైతులు ఎప్పడూ మోసపోతూనే ఉన్నారు.  
 - కొమ్మన మురళీ కృష్ణారావు, రైతు, వట్లూరు
 
 పోలవరంపై పెట్టిన డబ్బు వృథాయేనా
 మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల అవసరాలు గుర్తించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడితే, కొంతమంది రాజకీయ దురుద్ధేశంతో నిర్మాణాన్ని ఆలస్యం చేశారు. ఇప్పుడు                ప్రత్యేక రాష్ట్రం పేరుతో తెలంగాణ నాయకులు పోలవరం నిర్మాణాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు విచారకరం. ఇప్పటి వరకూ జరిగిన నిర్మాణం నిమిత్తం ఖర్చు పెట్టిన మా డబ్బు               కోట్లాది రూపాయలు బూడిదలో పోసిన  పన్నీరు కావలసిందేనా.                                     
 - ఉప్పాటి సత్యం, రైతు, నల్లజర్ల
 
 నాయకులంతా ఏకతాటిపైకి రావాలి
 మన ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల నాయకులూ ఏకతాటిపైకి వచ్చి కేంద్రానికి ఈ ప్రాంత ప్రజల అబిప్రాయాన్ని చెప్పి ఉంటే రాష్ట్ర విభజన అంశం ఇంత దుమారం రేపి ఉండేది కాదు. ఎవరికి వారు వారి స్వప్రయోజనాలకోసమే రాజకీయాలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి చులకనైపోయాం. ఇప్పటికైనా అందరూ కలిసి పోరాడండి.
 - పెండ్యాల వీర రాఘవులు, రైతు, పోతవరం
 
 ఒక్క పంటకూ నోచుకోము
 గతంలో సార్వా, దాళ్వా రెండు పంటలనూ మా ప్రాంతంలో పండించే వాళ్లం. సాగునీరందక ఇప్పుడు కేవలం సార్వా మాత్రమే వేస్తున్నాం. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ వాళ్లు తప్పకుండా మన ప్రాంతానికి నీరు రానివ్వరు. అదే జరిగితే ఒక్క పంట కూడా వేయలేము. మా కుటుంబాల పరిస్థితి ఏమికావాలి.
 - మిరియాల ఆదినారాయణ, రైతు, పిప్పర
 
 ముక్కలు చేయాలని చూస్తే..
 తెలుగు గడ్డపై పుట్టాం. తెలుగు మాట్లాడే వాళ్లం దరం కలిసి ఉండడం మా జన్మ హక్కు. మీ రాజకీయా ల కోసం కలిసిమెలిసి ఉంటున్న మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నిస్తారా. మా ఇష్టానికి వ్యతి రేకంగా మా ప్రాంతాన్ని విడగొట్టడానికి మీరెవరు. ముక్కలు చేయాలని చూస్తే ఖబడ్దార్, తరిమితరిమికొడతాం.
 - చల్లగోళ్ళ జయలక్ష్మి, మహిళా రైతు, పెదకడిమి
 
 మా పిల్లల భవిష్యత్తేంటి
 అష్టకష్టాలు పడి పిల్లల్ని చదివించుకుంటున్నాం. మీ ఇష్టానికి రాష్ట్రాన్ని విభజిస్తే వారికి ఉద్యోగావకాశాలు ఎక్కడ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగానికి చెందిన సంస్థలు సైతం తెలంగాణ ప్రాంతంలోనే అధికంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మా ప్రాంతానికి మేమే వలసలు వెళ్లాలా?
 - కె. దయావతి, అంగన్‌వాడీ టీచర్, గంటావారిగూడెం
 
 విద్యాహక్కును కాలరాయకండి
 దేశం సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని పాలకులే చెబుతారు. అందుకోసం కోట్లాది నిధులను ఖర్చు పెడుతున్నారు. తెలంగాణలో ఉన్న విద్యా సంస్థలు ఇక్కడ లేవు. ఒకటే రాష్ట్రమైతే అక్కడికి          వెళ్లి చదువుకుంటాం. వేరే రాష్ట్రంగా విడిపోతే            మా విద్యావకాశాలు మరింత సన్నగిల్లిపోతాయి. విద్య లేకపోతే ఉద్యోగాలు రావు. దీంతో భవిష్యత్‌తరాలు విద్య జోలికి వెళ్లరు. మా విద్యా హక్కును కాలరాయకండి ప్లీజ్.
 - జె.సౌందర్య, ఇంటర్ విద్యార్థిని
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement