♦ ముచ్చెమటలు పట్టించిన తుపాకీ
♦ నందిగామ ఘటనపై వెంటాడిన సిమీ అనుమానాలు
♦ దోపిడీ దొంగలని ముగింపు
నందిగామ జాతీయ రహదారిపై దోపిడీ ఘటన పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. కొద్ది రోజులుగా సిమీ ఉగ్రవాదులు విజయవాడ నగరానికి రాకపోకలు సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. తాజా ఘటన ఖాకీలను కలవరపర్చింది. విజయవాడకు చెందిన వ్యక్తిని తుపాకీతో బెదిరించి దోచుకున్నట్టు తెలిసిన వెంటనే జాతీయ రహదారిపై భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానిత వాహనాలను తనిఖీ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో దోపిడీ దొంగల పనే అని తేలడంతో కూల్ అయ్యారు. జిల్లాలో పెరుగుతున్న గన్‌కల్చర్, దోపిడీ దొంగల బీభత్సం పోలీసుల పనితీరుకు సవాల్ విసురుతున్నాయి.
విజయవాడ సిటీ : జాతీయ రహదార్లను అడ్డాగా చేసుకొని దోపిడీ ముఠాలు తిరుగుతున్నాయా? ఒంటరి వ్యక్తులను కారులో ఎక్కించుకొని తుపాకులతో బెదిరించే కొత్త సంస్కృతికి తెరలేపారా? నందిగామ, రాజమండ్రిలో జరిగిన దోపిడీలను పరిశీలిస్తే ఔననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ ఆయుధాలతో హైవే ముఠాలు హల్‌చల్ చేస్తున్నాయి. అవకాశం ఉన్నచోట దోపిడీలకు తెగబడుతున్నాయి. నందిగామ సమీపంలోని హనుమంతునిపాడు సమీపంలో జరిగిన దోపిడీ కూడా ఇదే తరహాలో జరిగి ఉండొచ్చని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి.
విజయవాడకు చెందిన పప్పుల వ్యాపారి పులిపాటి సురేష్‌కుమార్‌ను నందిగామ సమీపంలోని హనుమంతునిపాడు వద్ద తుపాకీ చూపి బెదిరించిన వ్యక్తులు అతని ఒంటిపై ఉన్న నగలు దోచుకున్నారు. నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లికి వెళ్లేందుకు కుమ్మరిపాలెం సెంటర్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న సురేష్‌కుమార్‌ను ఏపీ 31క్యూ 3438 ఎరుపు రంగు ఇండికా కారులో వెళుతున్న వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామని చెప్పారు. తాము సూర్యాపేట వరకు వెళుతున్నట్టు చెప్పడంతో సురేష్‌కుమార్ వారి కారెక్కగా హనుమంతునిపాడు వద్ద దోపిడీ జరిగింది. గత రాత్రి రాజమండ్రిలో ఓ వ్యక్తిని బెదిరించి నగలు దోచుకున్న వ్యక్తులు కూడా వీరేనని బాధితుని సమాచారం ఆధారంగా భావిస్తున్నారు. అక్కడ దోపిడీ చేసిన తర్వాత ఏలూరు లేదా రాజమండ్రిలో ఆదివారం రాత్రి షెల్టర్ తీసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానం.
ఒక్కరేనా...
జరిగిన దోపిడీ ఒకే తరహాదైనప్పటికీ కారు రంగులు తేడా రావడం పోలీసులకు అంతుచిక్కడం లేదు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రాజమండ్రిలో ఓ వ్యక్తిని కారులో ఎక్కించుకొని బెదిరించిన ఆగంతకులు నగదు, నగలు దోపిడీ చేశారు. ఆగంతకులు తెలుపు రంగు కారులో వచ్చినట్టు అక్కడి పోలీసులకు బాధితుడు తెలిపాడు. ఇక్కడ ఎరుపు రంగు కారులో వచ్చి దోపిడీ చేశారు. దోపిడీ చేసిన విధానం, వ్యవహరించిన తీరు, మాట్లాడిన భాష రెండు చోట్లా బాధితులు చెప్పేది ఒకే విధంగా ఉంది. అంటే అక్కడ దోపిడీ చేసిన వ్యక్తులే ఇక్కడ కూడా చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
అక్కడ నేరం చేసిన తర్వాత కారు మార్చి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని బట్టి ముఠాలో ఎక్కువ మంది సభ్యులు ఉండొచ్చని తెలుస్తోంది. నందిగామ దోపిడీ నిందితులు తెలంగాణా జిల్లాలకు పరారై ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు.. ఆ దిశగా అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చి చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. ఇదే సమయంలో విశాఖ పోలీసుల సాయంతో కారు యజమానిని గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బాధితుడు చెపుతున్న కారు విశాఖ రవాణా శాఖ కార్యాలయంలో రశ్మిత పాత్రో అనే మహిళ పేరిట రిజిస్ట్రేషన్ అయినట్టు పోలీసు వర్గాలు గుర్తించాయి. దీనిని బట్టి కారు ఉపయోగిస్తున్న వ్యక్తుల వివరాలు రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కొత్త కల్చర్
దోపిడీల్లో గన్ కల్చర్ మొదలైంది. గతంలో జరిగిన దోపిడీలకు భిన్నంగా తుపాకీ చూపించి సొత్తు దోచుకునే ముఠాలు తయారయ్యాయి. గతంలో జాతీయ రహదార్లను అడ్డాగా చేసుకొని దోపిడీలు చేసిన ముఠాలు అనేకం ఉన్నాయి. నిర్జన ప్రదేశాల్లో వాహనాలను ఆపి దోచుకునేవారు. ఇందుకు భిన్నంగా కొత్త కల్చర్ రావడం పోలీసులను కలవరపరుస్తోంది. లిఫ్ట్ పేరిట నమ్మకంగా కారు ఎక్కించుకొని పిస్టల్ చూపి బెదిరించి దోపిడీలకు పాల్పడటం ఇటీవల కొత్తగా వెలుగులోకి వస్తోంది.
గన్ చూపించి వ్యక్తుల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రా ల్లో కారు చౌకగా నాటు తుపాకులు దొరుకుతున్నాయి. రూ.15వేల నుంచి రూ.50వేల వరకు వెచ్చిస్తే ఆధునిక ఆయుధాలు, తూటాలు ఇస్తున్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ మాఫియా, కిరాయి హంతక ముఠాలు ఈ తరహా ఆయుధాలు వాడుతున్నాయి. కొత్తగా దోపిడీ ముఠాలు వీటిని వినియోగించడం ఆందోళనకర పరిణామం.
కలకలం కలవరం
Published Tue, Apr 7 2015 4:34 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement
Advertisement