రిజిస్ట్రేషన్స్ బాదుడుకుపచ్చజెండా!
- రేపటి నుంచి అమలుకు సిద్ధం!
- జేసీతో రిజిస్ట్రేషన్ అధికారుల భేటీ
విజయవాడ : రిజిస్ట్రేషన్స్ బాదుడుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి పొలాలు, స్థలాల విలువలు పెంచేందుకు రిజి స్ట్రేషన్స్, రెవెన్యూ అధికారులు కసరత్తు పూర్తిచేశారు. ప్రభుత్వం నుంచి తుది ఉత్తర్వులు అందగానే శుక్రవారం నుంచి కొత్త రేట్ల ప్రకారం మార్కెట్ విలువలు పెంచేందుకు తుది ప్రతిపాదనలను తయారుచేశారు. బుధవారం రాత్రి జాయింట్ కలెక్టర్ జె.మురళి ఆధ్వర్యంలో మార్కెట్ విలువలు నిర్ధారించే కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సబ్ రిజిస్ట్రార్లు తయారుచేసిన ప్రతిపాదనలను కమిటీ చైర్మన్, జాయింట్ కలె క్టర్ పరిశీలించినట్లు సమచారం. మొత్తం మీద గతంలో ఉన్న రేట్ల కంటే 30 నుంచి 70 శాతం పెంచాలని ఆ కమిటీ తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వం నుంచి గురువారంలోపు వచ్చే ఆదేశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. జిల్లాలోని 28 మంది సబ్-రిజిస్ట్రార్లు తమతమ ఏరియాల్లో బహిరంగ మార్కెట్ విలువలకు, ప్రభుత్వ మార్కెట్ విలువలకు ప్రతిపాదనలు తయారుచేశారు.
గ్రామాల్లో పెరగనున్న విలువలు
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే తక్కువగా ఉన్న భూములు, స్థలాల విలువలు భారీగా పెంచేందుకు అధికారులు ఆమోదం తెలిపారు. కృష్ణాజిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న గన్నవరం, ఉయ్యూరు, నూజివీడు, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, మచిలీపట్నం, తదితర ప్రాంతాల్లో బయట మార్కెట్ విలువలతో చూసుకుని ప్రభుత్వ విలువలను భారీగా పెంచారు. ఆయా ప్రాంతాల్లో గతంలో ఉన్న విలువల క ంటే 70 శాతం ప్రభుత్వ విలువలు పెరగనున్నట్లు తెలిసింది.
విజయవాడలో 30 శాతం...
విజయవాడ నగరంలో ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువలకంటే 30 శాతం పెంచినట్లు తెలిసింది. గాంధీనగర్ , గుణదల, పటమట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 30 శాతం విలువ పెరిగినట్లు సమాచారం. అదేవిధంగా జిల్లాలో అన్నిమున్సిపల్ కేంద్రాలలో కూడా మార్కెట్ విలువలు భారీగా పెరగనున్నాయి.