నెల్లూరు / సంగం: కళాకారులతో వెళుతున్న టెంపో వాహనం బోల్తాపడి గాయకుడు మృతిచెందిన ఘటన సంగం మండలంలోని దువ్వూరు–సిద్ధీపురం మార్గమధ్యలో నెల్లూరు–ముంబై జాతీయ రహదారి వద్ద బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన సుస్వర పాటకచ్చేరి బృందం టెంపో వాహనంలో మంగళవారం వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరుకు వెళ్లింది. అక్కడ పాటకచ్చేరి నిర్వహించింది. బృందం బుధవారం మైదుకూరు నుంచి నెల్లూరుకు వాహనంలో నెల్లూరుకు బయలుదేరింది.
ఈ క్రమంలో మండలంలోని దువ్వూరు–సిద్ధీపురం మధ్య నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై టెంపో ముందు చక్రం టైరు ఒక్కసారిగా పగిలిపోవడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న రొయ్యలగుంతలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి గుంతలోకి దిగి ప్రయాణికులను బయటకు తీశారు. ఈ ఘటనలో గాయకుడు, డ్రైవర్ అయిన కిషోర్ (45) అక్కడికక్కడే మృతిచెందాడు. మహిళా సింగర్లు ప్రశాంతి, రమ్య, జ్యోతి, సిరి, డ్యాన్సర్లు వినోద్, సాయి, అత్తిలి, సాయి, విద్యాసాగర్ తీవ్రంగా గాయపడ్డారు. వాహనంలో ఉన్న కళాకారులకు సంబంధించిన రూ.లక్ష విలువ చేసే వాయిద్య పరికరాలు ధ్వంసమయ్యాయి. సంగం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
108 రాక ఇక్కట్లు
ఘటన జరిగిన వెంటనే 108కి సమాచారం అందించడంతో ఒక వాహనం వచ్చింది. ఇందులో ప్రశాంతి, రమ్య, జ్యోతి, సిరిలను తరలించారు. మిగిలిన వారిని తరలించేందుకు మరో వాహ నం రావడం తీవ్రంగా ఆలస్యమైంది. దీంతో క్షతగాత్రులు రోడ్డుపై పడుకొని విలపిం చారు. స్థానికులు వారిని వెంటనే ఆటోలో బుచ్చిరెడ్డిపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 108కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాహనం రాకపోవడం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment