- వినియోగదారులకు విద్యుత్ కోతల వివరాలు
- ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు సేకరిస్తున్న ట్రాన్స్‌కో
నక్కపల్లి: విద్యుత్ కోతలు ఎప్పుడు అమలుచేస్తున్నారు, కరెంటు ఎప్పుడు పోతుంది.. ఎప్పుడు వస్తుంది..అనే వివరాలు నేరుగా వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేయడానికి ఏపీ ట్రాన్స్‌కో శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు నగరాలకే పరిమితమైన ఈ విధానాన్ని ఇక నుంచి గ్రామీణప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు కూడా తెలియజేయడానికి నిర్ణయించింది.
ఈ చర్యల్లో భాగంగా విద్యుత్ వినియోగదారుల నుంచి ఆధార్‌కార్డుల నంబర్లు, జెరాక్స్‌కాపీలు, ఫోన్ నంబర్లను సేకరిస్తోంది. మీటర్ రీడింగ్‌లు తీసే కాంట్రాక్టర్లు, ట్రాన్స్‌కో సిబ్బంది గురువారం నుంచి పలు గ్రామాల్లో వినియోగదారుల నుంచి ఈ వివరాలు సేకరిస్తున్నారు. ఉపమాక నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్రకటిత విద్యుత్ కోతల వల్ల ప్రజలు, వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కరెంటుపోతే సమీపంలో ఉన్న సబ్‌స్టేషన్‌లో సంప్రదిస్తే ఈఎల్‌ఆర్‌అనో, బ్రేక్‌డౌన్ అనో ఎప్పుడు వస్తుందో తెలియదని సమాధానం చెబుతున్నారు.
గంటల తరబడి కరెంటు రాకపోతే ఎవరిని అడగాలో తెలియక వినియోగదారులు అవస్థలు పడేవారు. దీనికి తోడు గ్రామాల్లో ఉండే ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌లు ఈ విద్యుత్ కోతలను సాకుగా తీసుకుని ఇష్టానుసారం సరఫరా నిలిపివేసి తమ పనులు చక్కబెట్టుకునేవారు. ఇక నుంచి ఇటువంటి ఆటలకు చెక్ చెప్పనున్నారు. వినియోగదారుడి ఫోన్ నంబరుకు విద్యుత్‌కోతలు ఏ సమయంలో అమలు చేస్తున్నారు, ఏ కారణం చేత కరంటు సరఫరా నిలిపివేయాల్సి వచ్చిందనే వివరాలను ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేయడానికి ట్రాన్స్‌కో శ్రీకారం చుట్టడంతో సిబ్బంది వినియోగదారుల ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
అప్రకటిత విద్యుత్ కోతల సమాచారంతోపాటు, బిల్లు చెల్లింపుల వివరాలు, బిల్లు మొత్తం, ఎప్పటిలోగా బిల్లు చెల్లించాలనేవివరాలను కూడా తెలియజేసేందుకు వినియోగదారుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు కూడా ఈ వివరాలు సేకరిస్తున్నట్టు ఏఈ సుధాకర్ తెలిపారు.