రాజధానిలో ఐటీ ఉద్యోగిని అదృశ్యం
హైటెక్ సిటీలో విధులకు వెళ్లి..
మేడ్చల్ శివారులో ద్విచక్ర వాహనం లభ్యం
మేడ్చల్, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో నివసిస్తూ, హైటెక్ సిటీలో పనిచేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అదృశ్యమయ్యారు. శుక్రవారం ఉదయం ఆఫీస్‌కు వెళ్లిన ఆ వివాహిత తిరిగిరాలేదు. అయితే, ఆమె వినియోగించే ద్విచక్ర వాహనం మాత్రం పట్టణ సమీపంలోని ఈఎంఆర్‌ఐ వద్ద పోలీసులకు లభించింది. పేట్ బషీరాబాద్ పోలీసులు, ఉద్యోగిని కుటుంబీకుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీలత (26), కిరణ్ దంపతులు తమ ఇద్దరు కూతుళ్లతో మేడ్చల్‌లోని సూర్యానగర్ కాలనీలో ఉంటున్నారు. కిరణ్ మండల పరిధిలోని శాంతా బయోటెక్నిక్ కంపెనీలో, శ్రీలత హైటెక్ సిటీలోని మ్యాక్స్ హైన్ రిప్లాంటేషన్ ఐటీ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నారు. శ్రీలత నిత్యం ద్విచక్ర వాహనంపై ఆఫీసుకు రాకపోకలు సాగిస్తున్నారు.
శుక్రవారం ఆ దంపతులు తమ పిల్లలను పాఠశాలకు పంపి విధులకు వెళ్లారు. సాయంత్రం కిరణ్ ఇంటికి రాగా, రాత్రి 9 గంటలైనా శ్రీలత రాలేదు. దీంతో కంగారుపడిన కిరణ్.. భార్య పనిచేసే కార్యాలయానికి, ఆమె స్నేహితులకు ఫోన్‌చేశారు. సాయంత్రమే శ్రీలత ఆఫీస్ నుంచి వెళ్లిపోయినట్లు సమాధానం చెప్పారు. మరోపక్క సాయంత్రం నుంచి శ్రీలత సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. రాత్రి గస్తీలో ఉన్న పోలీసులకు మేడ్చల్ మండల శివారులోని ఈఎంఆర్‌ఐ వద్ద 44వ జాతీయ రహదారి పక్కన ఓ స్కూటీ(ఎపీ29ఎఆర్0308) లభించింది. వాహనంలో ఉన్న ఆర్సీ బుక్ ద్వారా శ్రీలతకు చెందినదిగా గుర్తించి కిరణ్‌కు సమాచారం ఇచ్చారు. శుక్రవారం విధులకు వెళ్లిన తన భార్య కనిపించడం లేదని కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్, పేట్ బషీరాబాద్, దుండిగల్ పోలీసులు శ్రీలత ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సీఐ జానయ్య వివరాలు సేకరించారు. కాగా, శ్రీలత అదృశ్యంపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.