కొత్త రాజధాని నిర్మాణానికి ఇబ్బందులు: చంద్రబాబు
కొత్త రాజధాని నిర్మాణానికి కొన్ని ఇబ్బందులున్నాయని, వాటిని అధిగమించి జూన్ 6న భూమిపూజ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సింగపూర్ ప్రభుత్వం నుంచి మాస్టర్ ప్లాన్ అందుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని కోసం ఈ ప్రాంతంలో 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను తాను అభినందిస్తున్నానన్నారు. ఇప్పటికే 17 వేల ఎకరాలు అప్పగించారని, రైతులు ఉదారంగా ముందుకొచ్చారని ఆయన అన్నారు.
రాజధాని ప్రాంతంలో భూమిలేని పేదలు కూడా చాలా ఉదారంగా ముందుకు వచ్చారని, వారికి నెలకు రూ. 2,500 పింఛను ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో తమకున్న సన్నిహిత సంబంధాల కారణంగా వీలైనంత త్వరగా మాస్టర్ ప్లాన్ ఇవ్వగలిగినట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చెప్పారు. తాము హరిత రాజధాని కోసం ప్లాన్ ఇచ్చామని, ఆ మేరకే ప్రణాళిక కూడా ఇచ్చామని ఆయన అన్నారు.