
సాక్షి, అమరావతి: పోలీసుశాఖలో పలువురు అధికారుల పక్కచూపులు మొదలయ్యాయి. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో పలువురు కేంద్ర సర్వీసులవైపు చూస్తున్నట్టు చెబుతున్నారు. రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్‌తో పాటు పలువురు ఐపీఎస్‌లు సైతం క్యూ కడతారంటూ ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి పలువురు పోలీసు అధికారులు చంద్రబాబుకు వీరవిధేయులుగా పనిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెల్సిందే.
ఎన్నికల ఫలితాలు వెలువడే మే 23వ తేదీ నాటికి పలువురు ఐపీఎస్‌లు కేంద్ర సర్వీసుకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకునే విషయమై పోలీసుశాఖలో ఆసక్తికర చర్చ సాగుతోంది. వాస్తవానికి అఖిల భారత సర్వీసుకు చెందిన ఐపీఎస్, ఐఏఎస్ వంటి కీలక అధికారులు రాష్ట్రంలో పలు రాజకీయ వివాదాల్లో కూరుకుపోయారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేశారనే విమర్శలను మూటగట్టుకోవడం ఇబ్బందికరంగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా ఏపీలోని కొందరు పోలీసు అధికారులు మరీ బాహాటంగానే పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేశారంటూ ఫిర్యాదులొచ్చాయి. ప్రస్తుత డీజీపీ ఠాకూర్ గతంలో ఏ డీజీపీ కూడా ఎదుర్కోనన్ని ఆరోపణలను అతి తక్కువ సమయంలోనే మూటగట్టుకున్నారు.
సదా చంద్రబాబు సేవలో..
ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు అయితే అసలు విధులు వదిలి చంద్రబాబు కోసం రాజకీయ సర్వేలు, పార్టీ ఫిరాయింపులు వంటి అనేక కార్యకలాపాలు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ మాజీ బాస్ ఏబీ వెంకటేశ్వరరావు, పోలీస్ ప్రధాన కార్యాలయంలోని శాంతిభద్రతల సమన్వయ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు యోగానంద్, మాధవరావులతో పాటు పలు జిల్లాల ఎస్పీలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల పరంపరను కొనసాగించింది. రాష్ట్రంలో రాజకీయ చిత్రం మారనుందనే విషయం తెలుసుకున్న వారిలో ఆందోళన పెరిగిపోతోంది. ఎందుకైనా మంచిది.. కేంద్ర సర్వీసులకు వెళ్లిపోదామన్న ఆలోచనలతో పలువురు ఐపీఎస్‌లు పావులు కదుపుతున్నట్టు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment